న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈనెల 14 నుండి ప్రారంభం కానున్న రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై చర్చించారు. రెండో విడత పాదయాత్ర జరిగే క్రమంలో రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌లతో కలిసి మంగళవారం జేపీ నడ్డాను కలిసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతోపాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్ కార్యాచరణపై అరగంటకు పైగా చర్చించారు. టీఆర్ఎస్ నియంత, కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేసిన జేపీ నడ్డా, రెండో విడత యాత్ర కూడా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు హాజరై సంఘీభావం తెలిపే విషయంలో సానుకూలంగా స్పందించిన జేపీ నడ్డా వీలు చూసుకుని పాదయాత్ర జరిగే సమయంలో రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, నియంత పాలనపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న పోరాటాలను ఈ సందర్భంగా జేపీ నడ్డా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మీరు చేస్తున్న పోరాటాలు భేష్, ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారం వచ్చే అవకాశాలున్నాయి, మరింత ఉధ్రుతంగా ఉద్యమాలు చేయండి, మీకు అండగా మేమున్నామంటూ నడ్డా బండి సంజయ్‌ను ప్రోత్సహించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..