Tuesday, November 26, 2024

ప్ర‌శ్న‌ ప‌త్రాల లీకేజీ సూత్ర‌దారి బండి సంజ‌యే : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

వ‌రంగ‌ల్ : బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో ఉన్న ఆదరణ చూసి ఓర్చుకోలేక బీజేపీ నీచ రాజకీయాలకు దిగజారుతోంద‌ని, బండి సంజయ్ సూత్రదారిగా రాష్ట్రంలో ప్రశ్న పత్రాల లికేజీ కుట్ర జరుగుతోంద‌ని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. పదవ తరగతి ప్రశ్న పత్రాల లికేజీ అంశంపై వరంగల్ శివ నగర్ లోని సాయి కన్వెన్షన్ హాల్లో ఆయ‌న‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకన్న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. చదువు విలువ తెలియని సన్నాసుల పార్టీ పన్నిన పన్నాగం పదవ తరగతి ప్రశ్న పత్రాల లికేజీ డ్రామా అన్నారు. గ్రూప్1, 10వ తరగతి పేపర్ లికేజీలలో బిజెపి పార్టీ పాత్ర ఉంద‌న్నారు. మొన్న తాండూరులో తెలుగు ప్రశ్న పత్రం లికేజీలో ఉపాద్యాయుడు బందెప్ప బీజేపీ అనుకూల సంఘం నాయకుడు, నిన్న హిందీ పేపర్ లీకేజీలో ఉన్న ప్రశాంత్ బండి సంజయ్ అనుచరుడు అన్నారు. ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ఆందోళన ఎందుకు చేస్తున్నారు? అన్నారు. బండి సంజయ్ తన మనుషుల ద్వారా, కార్యకర్తల ద్వారా, అనుకూలంగా ఉండే ఉపాధ్యాయుల ద్వారా పేపర్ల లికేజీకి కుట్ర చేశారు. బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రతోనే ఇది జరుగుతుంద‌న్నారు. బీజేపీ నాయకులకు చదువు విలువ తెలియదు, వారు ఎక్కడా చదువుకోలేదు, కష్టపడి పరీక్ష రాయలేదు అందుకే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కొలువులు, చదువులు వదిలేయండి, బీజేపీ పార్టీకి పనిచేయండి అని బహిరంగంగా పిలుపునిచ్చిన బండి సంజయ్ నేడు పదవ తరగతి ప్రశ్న పత్రాల లికేజీకి పాల్పడ్డాడు. ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని ప్రచారం చేసి పరీక్షలు వాయిదా వేయించి ఖాళీగా ఉన్న విద్యార్థులను రాజకీయాలకు వాడుకోవాలని నీచమైన కుట్ర చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రశ్న పత్రాలు ఎక్కడా లీక్ కాలేదు, కేవలం బీజేపీ కార్యకర్తలే ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మాత్రమే లికేజీ డ్రామా ఆడుతున్నారు అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు, రాష్ట్ర ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు బీజేపీ కుట్రలను ఖండించాల‌న్నారు. ప్రశ్న పత్రాల లికేజీ విషయంలో నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఖాబర్దార్ బీజేపీ నాయకుల్లారా… బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే చిల్లర రాజకీయాలు చేస్తున్నార‌న్నారు. నిజంగా బీజేపీ నాయకులకు దమ్ము ఉంటే ప్రజలకు ఎం చేస్తారో, ఎం చేశారో చెప్పండి అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేయడం కాదు దమ్ముంటే రాజకీయంగా తలపడండి.. విద్యార్థులను, యువతను అడ్డుపెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీ నాయకుల్లారా… ఖాబర్దార్ ఆ యువతే మీకు సరైన బుద్ది చెబుతుంద‌న్నారు.

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేకే బిజెపి పార్టీ పేపర్ లికేజీ కుట్రలు చేస్తోంది. హిందీ పేపర్ లీకేజీ కేసులో పోలీస్ స్టేషన్ లో ఉన్న బిజెపి పార్టీకి బుద్దిలేద‌న్నారు. హిందీ పేపర్ లీకేజీ అయిన ప్రాంతం కమలపూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ది అన్నారు. పేపర్ లీకేజీ వెనుకాల బిజెపి అనుబంధ సంఘం యువమోర్చా పని చేస్తుంద‌న్నారు. నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలు రాసె పిల్లల జీవితాలను ఏమి చేయాలని అనుకుంటున్నారు, బండి సంజయ్ కూడా 10వ తరగతి కూడా పాస్ అయ్యాడో లేదో ?, బిజెపి పార్టీ
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో ఏమి చేయాలనుకున్నారో చెప్పాల‌న్నారు. దేశాన్ని విచ్చిన్నం చేయాలని అనుకుంటున్నారు. పేపర్ లీకేజీలో శివ వాట్సప్ లో పెడితే ప్రశాంత్ ఇతర గ్రూప్ లో పోస్టు చేసి 142 సార్లు ఫోన్లో ఎందుకు మాట్లాడారో చెప్పాలి. హిందీ పేపర్ లీకేజీ అరెస్ట్ సంఘటనలో పోలీస్ స్టేషన్ దగ్గర బీజేపీ ఆందోళన ఎందుకు చేశారు చెప్పాల‌న్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement