Saturday, November 23, 2024

Delhi | ఢిల్లీలో బండి సంజయ్.. అధిష్టానం పెద్దలను కలిసేందుకు నిరీక్షణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు – చేర్పులపై విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ రాష్ట్రాధ్యక్షులు బండి సంజయ్ హుటాహుటిన బయల్దేరి హస్తిన చేరుకున్నారు. బండి సంజయ్‌తో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంత కుమార్ కూడా ఢిల్లీ చేరుకున్నట్టు సమాచారం. బండి సంజయ్‌కు అధిష్టానం నుంచే పిలుపు అందిందని, ఆ మేరకే ఢిల్లీకి బయల్దేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సోమవారం ఢిల్లీలో ఆయన పార్టీ పెద్దలెవరినీ కలవలేదని సమాచారం. సోమవారం రాత్రి ఆలస్యంగా పార్జీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను కలిసే అవకాశం ఉందని తెలిసింది.

ఓవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంతో బిజీగా ఉండగా.. పార్టీలో ఇతర ముఖ్య నేతలు కూడా ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో రోజంతా బిజీగా ఉన్నారు. అందుకే రాత్రి ఆలస్యంగా నడ్డా ఇంటికే బండి సంజయ్‌ను పిలిపించి రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి చేపట్టనున్న మార్పుల గురించి వివరించనున్నట్టు సమాచారం. తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న మరికొన్ని రాష్ట్రాల్లోనూ మార్పులు చేర్పులు చేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కసరత్తు చేసింది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, గోవా, మణిపూర్ ముఖ్యమంత్రులను తొలగించి, వారిలో కొందరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పంపిస్తారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. పార్టీ వర్గాలు సైతం ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. సోమవారం రాత్రికి లేదా మంగళవారం ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ కానున్నట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా ప్రాధాన్యత కల్గిన పదవిని, బాధ్యతల్ని అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చేలా ఈటల ట్వీట్లు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది.

మొత్తంగా తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు – చేర్పులు నిజమేనని, ఆ క్రమంలోనే బండి సంజయ్‌కు ఢిల్లీ నుంచి పిలుపు అందిందని తెలుస్తోంది. ఇదే సమయంలో బండి సంజయ్‌ను మార్చే విషయంలో అధిష్టానం పునరాలోచిస్తోందని పార్టీలోని ఒక వర్గం చెబుతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) బండి సంజయ్‌కు మద్ధతుగా పార్టీకి సందేశం పంపించిందని, బండి సంజయ్‌పై తప్పుడు రిపోర్టులు పార్టీకి అందించినట్టు పేర్కొందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అందరూ ఊహిస్తున్న మార్పు ఉండకపోవచ్చని, సంజయ్‌నే అధ్యక్షుడిగా కొనసాగిస్తూ కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని వారంటున్నారు. ఇలా పార్టీలో ఒక్కో వర్గం, ఒక్కో రకంగా చెబుతుండగా.. అసలు పార్టీ అగ్రనేతలు మోదీ-షా ల మదిలో ఏముందున్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement