నాగోల్ – తెలంగాణలో భజరంగ్‌దళ్‌ను నిషేధించాలని కేసీఆర్ భావిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగిన బీజేపీ ఓబీసీ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, అదే జరిగితే హిందూ సమాజం ఏకమై కెసిఆర్ ని ఫామ్ హౌజ్ పంపుతారని హెచ్చరించారు.. భజరంగ్‌దళ్‌ను నిషేధించడంలో కేసీఆర్ కాంగ్రెస్‌తో పోటీ పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుట్రను తిప్పికొట్టటానికి హిందువులంతా ఏకంకావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. దళిత బంధును ప్రకటించిన కేసీఆర్..బీసీ బంధును ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు.
బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వటం వెనుక కుట్ర దాగుందని గళమెత్తారు. కేసీఆర్ క్యాబినెట్‌లో ముగ్గురు మాత్రమే బీసీ మంత్రులున్నారని చెప్పారు. కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం నాలుగు మంత్రి పదవులా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించి బీసీల పొట్టకొట్టిందని మండిపడ్డారు. హైదరాబాద్ లో త్వరలో లక్షల మందితో బీసీ శంఖారావ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో రామ రాజ్యం రావడానికి ఇంకా 5 నెలలే టైముందని అందుకోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన కోసం..తన కుమారుడు కెటిఆర్ కోసం రూ.1600 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించిన కేసీఆర్ .బీసీల ఆత్మగౌరవ భవనం ఎందుకు నిర్మించటంలేదని ప్రశ్నించారు. దళితబంధు పథకంలో 30 శాతం కమిషన్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని కేసీఆరే ఆరోపించారని, మరి వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఏ మాత్రం ఉండదని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.