అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అనుగుణంగా ప్లాస్టిక్ బ్యానర్స్ నిషేధం 21 జనవరి, 2023 నుండి అమల్లోకి రానున్నాయని అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. ప్లాస్టిక్ బ్యానర్స్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్ బట్టపై ముద్రించుటకు అనుగుణంగా ఉన్న యంత్రాలు, ముద్రించుటకు కావలసిన ముడిసరుకులను అందించే పరిశ్రమలు, ప్లెnక్స్ ప్రింటర్స్‌కు అవగాహన కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం ‘ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ బ్యానర్స్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ఆలోగా అందరూ ప్లాస్టిక్ రహితంగా ముద్రితమయ్యే యంత్రాలను సమకూర్చుకోవాలని చెప్పారు. ప్లాస్టిక్ రహితంగా బ్యానర్లు, ఫ్లెక్సీలను వాడటం ద్వారా పర్యావరణానికి చేకూరుతున్న ముప్పును కొంత మేర తగ్గించుకోవచ్చన్నారు.
అందుకే వాటికి ప్రత్యామ్నాయంగా బట్టపై ముద్రించే విధంగా అందరూ ముందుకొచ్చి సహకరించాలని కోరారు. ప్రభుత్వపరంగా ప్లాస్టిక్ బ్యానర్స్ ప్రింటర్స్‌కు ప్రత్యామ్నాయ మార్గాలకు కావలసిన యంత్రాల మార్పునకు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్లాస్టిక్‌ను వినియోగించడం వలన పర్యావరణానికి, మానవాళి మనుగడకు కలిగే నష్టం పెద్దస్థాయిలో ఉంటు-ందన్నారు. ప్రజలంతా స్వచ్ఛదంగా ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించడంలో భాగస్వాములు కావాలన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి సంపదలైన గాలి, నీరు, నేలను అందించాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ బ్యానర్లకు ప్రత్యామ్నాయంగా కాటన్ బట్టపై ముద్రించుటకు కావాలసిన యంత్రాలు, ముడిసరుకులు, ప్రింటింగ్ పరికరాలు వాటి యొక్క పనితీరును ప్రదర్శించడం జరిగింది. దేశంలోని చెన్నై, కోయంబత్తూరు, తమిళనాడు, హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాల నుండి ఈ యంత్రాలు, ముడిసరుకులను పంపిణీ చేసే పరిశ్రమలు ఈ కారక్రమంలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఏపీపీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. శివారెడ్డి, సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సీహెచ్. కృష్ణమూర్తి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఈ. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.