కేంద్ర ప్రభుత్వం అకస్మత్తుగా ల్యాప్‌టాప్స్, ఆల్‌ఇన్ వన్ పీసీలు, ట్యాబ్‌ల దిగుమతులపై నిషేధం విధించడం పట్ల పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. వీటికి దిగుమతి చేసుకోవాలంటే తగిన లైసెన్స్ అవసరమని కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మూడు నుంచి 6 నెలల వరకు గడువు ఇచ్చే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ నెల 3న కేంద్రం ల్యాప్‌టాప్స్, పర్సనల్ కంప్యూటర్లు, ట్యాబ్‌ల దిగుమతులను నిషేధించి, వెంటనే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇలా దిగుమతి చేసుకునేందుకు లైసెన్స్ తీసుకోవాలని కండిషన్ పెట్టింది. ప్రస్తుతం వీటి దిగుమతులకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. చైనా నుంచి వస్తున్న దిగుమతులను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు.
దేశీయంగా వీటి ఉత్పత్తిని, తయారీని ప్రోత్సహించేందుకు నిషేధం విధించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని కనీసం 3 నుంచి 6 నెలల వరకు వాయిదా వేయాలని పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన విజ్జప్తిని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, దీనిపై మరో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయంతో యాపిల్, డెల్, శామ్‌సంగ్ కంపెనీలకు ఇబ్బందులు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు తె లిపాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, స్థానిక తయారీని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ తెలిపారు. విశ్వసనీయమైన, ధృవీకరించిన దిగుమతులు వచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం తోడ్పడుతుందని ఆయన తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, పీసీలు, ట్యాబ్‌లను దిగుమతి చేసుకునే సంస్థలకు ప్రభుత్వం రెండు రోజుల్లో లైసెన్స్‌లు జారీ చేస్తుందని ఆయన తెలిపారు.
ఆన్‌లైన్‌లో లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 3 కంటే ముందు ఆర్డర్ చేసిన వాటిని దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. కొన్ని దిగుమతి అయిన వాటితో కొన్ని ఓడరేవుల్లోనే ఉండిపోయాయని, వీటిని త్వరగా క్లీయర్ చేయాలని ఆదేశించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. లైసెన్స్‌లు కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో వివరాలతో అప్లయ్ చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామని, ఇది ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి తెలిపారు.
ఇప్పటికే రెండు కంపెనీలు లైనెస్స్‌లకు అప్లయ్ చేసిందని, ఒక కంపెనీ ఎన్ని లైసెన్స్‌ల కోసమైనా అప్లయ్ చేసుకోవచ్చని చెప్పారు. నిషేధం అనేది లేదని, కేవలం కొన్ని ఆంక్షలు మాత్రమే ఉన్నందున వీటి ధరలు పెరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. దిగుమతులు ఒక నుంచి లైసెన్స్‌తో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక స్కీమ్ కోసంమే ఆంక్షలు పెట్టారన్నది వాస్తవం కాదని, ఈ నిర్ణయానికి, పీఎల్‌ఐ స్కీమ్‌కు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
రానున్న పండుగల సీజన్‌లో భారీగా అమ్మకాలు జరుగుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ దశలో ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆంక్షల మూలంగా ఇబ్బందులు వస్తాయని పరిశ్రమ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దేశీయంగా ఉత్పత్తిని పెంచడానికి, బహుళ జాతి కంపెనీలు దేశంలో తయారీ ప్లాంట్లు పెట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదం చేస్తుందని కొంతమంది భావిస్తున్నారు.