ఎట్టకేలకు హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిశాయి. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంది. ఈ ఎన్నికల కోసం టిఆర్ ఎస్,కాంగ్రెస్,బిజెపి పార్టీలు హోరా హోరీగా ప్రచారాలు,సభలు నిర్వహించాయి..నగదును పంచారనే ప్రచారం జరిగింది. కాగా ఈ ఉప ఎన్నికల బరిలో నిలిచిన 30 మంది అభ్యర్థుల్లో 20 మంది అభ్యర్థులు ఓటు వేయలేకపోవడం గమనార్హం. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగరావు సహా 19 మంది అభ్యర్థులు ఉన్నారన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థే ఓటు వేయకపోవడం ఏంటనేది ప్రశ్నగా మిగిలింది.
అయితే వీరంతా స్థానికేతరులు కావడంతో వారికి ఓటు వేసే అవకాశం దక్కలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయలేకపోయిన వారిలో బల్మూరి వెంకట్ ఒక్కరే ప్రధాన పార్టీ అభ్యర్థి ..కాగా, మిగతా వారందరూ స్వతంత్రులు, చిన్నాచితకా పార్టీలకు చెందినవారు. కాగా, ఒక ఉప ఎన్నికలో ఇంతమంది అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకోలేకపోవడం ఇదే తొలిసారని చెప్పాలి. అందులోనూ కాంగ్రెస్ అభ్యర్థే ఓటు వేయాలేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. విద్యార్థి నాయకుడైన బల్మూరి వెంకట్ ని ఏరీ కోరీ తీసుకువచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఆయన ఓటు వేయకపోవడంతో చర్చనీయాంశంగా మారింది.