Friday, November 22, 2024

Bala Ramaiah – అయోధ్యలో బాల రాముడు – బ‌హుసుంద‌రం రామయ్య రూపం

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్య మందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అద్భుత శిల్పకళా సంపద.. చూడగానే ఆకట్టుకునే హంగులతో ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లు స్పీడ‌ప్ అయ్యాయి. భక్తుల ప్రత్యేక పూజలు అందుకోనున్న బాలరాముడి విగ్రహం గర్భగుడిలోకి చేరింది. ఆ సుందరమూర్తికి చెందిన ఫొటోలను ఆల‌య క‌మిటీ రిలీజ్ చేసింది..
అయోధ్య రాముడిని ద‌ర్శించుకుని, మ‌న‌సారా కొలుచుకునేందుకు భ‌క్తులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహాన్ని వేదమంత్రాలు, ప్రత్యేక పూజల మధ్య అయోధ్య ఆలయానికి చేర్చారు. 51 అంగుళాల పొడవు, 1.5 టన్నుల బరువుతో నల్లని రూపంలో రామయ్య విగ్రహం ఉంది. కమలంపై నిల్చున్న బాలరాముడి ఫొటోను చూసి భక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు.

22న ప్రాణ‌ప్ర‌తిష్టామ‌హోత్స‌వం
అయోధ్య రామయ్య ముుఖం కనిపించకుండా తెల్లటి వస్త్రాన్ని కప్పారు. గర్భగుడిలో కొలువైన ఈ విగ్రహానికి జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకపూజలు చేసి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఇలా రామయ్య నిజరూపమే ఇంత అద్భుతంగా ఉంటే.. ఆభరణాలు, విల్లు ధరించాక చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందోనని భక్తులు అంటున్నారు. గురువారం అయోధ్య గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వేదమత్రోచ్చరణల మధ్య జరిగింది. దాదాపు నాలుగు గంటలపాటు 121 మంది పండితులు ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించారు. అయితే.. జనవరి 22న ప్రాణప్రతిష్ట అనంతరం రామయ్యను అలంకరించి ప్రత్యేక పూజలు ప్రారంభించానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement