Friday, November 22, 2024

ఇటు బెయిల్, అటు అరెస్ట్.. అభిషేక్, విజయ్ నాయర్లకు దొరకని ఊరట

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సోమవారం ఒక్కరోజే అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసులో కీలక నిందితులైన అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్లకు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ జైలు నుంచి విడుదలయ్యే మోక్షం మాత్రం లభించలేదు. బెయిల్ పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించడానికి కొన్ని గంటల ముందు ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా తిహార్ జైల్లో ఉన్న నిందితులిద్దరినీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టులో హాజరుపరిచి, ఇద్దరినీ ప్రశ్నించడం కోసం కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరింది. తిహార్‌ జైల్లో ఉన్న ఇద్దరినీ ఈనెల 8, 13 తేదీల్లో ప్రశ్నించి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 50 ప్రకారం వాంగ్మూలాలు నమోదు చేసినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది.

అంతకు ముందు గత నెలలో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి నివాసాల్లో సోదాలు జరిపినప్పుడు సెక్షన్ 17 ప్రకారం వాంగ్మూలం నమోదు చేసుకున్నట్టు వెల్లడించింది. అయితే అభిషేక్ పొంతనలేని సమాధానాలిచ్చారని, కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానమే ఇవ్వకుండా తప్పించుకున్నారని పేర్కొంది. అలాగే కొన్ని సాక్ష్యాధారాలను మాయం చేశారని కూడా ఆరోపించింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ కార్టెల్‌లో అభిషేక్ భాగమై ఉన్నారని వెల్లడించింది. ఈ సందర్భంగా నిందితులిద్దరినీ మరింత లోతుగా ప్రశ్నించేందుకు కస్టడీకి అప్పగించాలని కోరింది.

ఈ సందర్భంగా విజయ్ నాయర్ తరఫున రెబెకా జాన్ వాదనలు వినిపిస్తూ సెప్టెంబర్ 28న సమీర్ మహేంద్రు (ఇండోస్పిరిట్స్ సంస్థ అధినేత)ను ఈడీ అరెస్టు చేసిందని, ఆ మర్నాడు విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసిందని తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో 35 రోజులకు పైగా కొనసాగుతున్నారని వెల్లడించారు. అక్టోబర్ 27న బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఈడీ ఆ తర్వాత రెండు సార్లు ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసుకుందని చెప్పారు. ఒక ప్రణాళిక ప్రకారం జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకు ఈడీ అరెస్టు చేసిందని ఆమె ఆరోపించారు.

- Advertisement -

మరోవైపు అభిషేక్ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తూ.. అక్టోబర్ 8న సీబీఐ అరెస్టు చేసిందని, సెప్టెంబర్ 17న అభిషేక్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిపిందని వెల్లడించారు. మూడు వేర్వేరు తేదీల్లో ప్రశ్నించిందని తెలిపారు. ఈ సమయంలో ఈడీ కేవలం తేదీలను మాత్రమే నమోదు చేసుకుందని తెలిపారు. రూ. 3.85 కోట్ల లావాదేవీలపై సీబీఐ మోపిన అభియోగాలనే ఈడీ కూడా మోపిందని చెప్పారు. ఈడీ కస్టడీలో అభిషేక్ తల్లిని కలిసేందుకు అనుమతించాలని, ఇంట్లో వండిన ఆహారాన్ని అందించే వెసులుబాటు కల్పించాలని అభిషేక్ తరఫు న్యాయవాది కోరారు.

అయితే తల్లి కలిసేందుకు అనమతించిన స్పెషల్ కోర్ట్ న్యాయమూర్తి, ఇంట్లో వండిన ఆహారాన్ని అందించేందుకు మాత్రం నిరాకరించారు. అభిషేక్, విజయ్ నాయర్లను 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్తలు శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబులతో పాటు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్లను కలిపి ప్రశ్నించేందుకు ఈడీ ఏర్పాట్లు చేసుకుంది. తిహార్ జైలు నుంచి అభిషేక్, విజయ్ నాయర్లను ఈడీ కార్యాలయానికి తరలించింది.

బెయిల్ మంజూరు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ నమోదు చేసిన కేసులో అరెస్టయిన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై ఇద్దరికీ బెయిల్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. అంతకంటే ముందు ఇదే కేసులో కీలక నిందితుడు దినేశ్ అరోరా వాంగ్మూలం నమోదు చేసుకుంది. అప్రూవర్‌గా మారిన తర్వాత దినేశ్ అరోరా ఇచ్చే వాంగ్మూలం కేసులో కీలకం కానుంది.

ఆయనిచ్చే సమాచారంతో ఇటు సీబీఐ, అటు ఈడీ మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. తెరవెనుక ఉండి తతంగం మొత్తం నడిపించిన రాజకీయ ప్రముఖుల పాత్ర గురించి దినేశ్ అరోరా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే అప్రూవర్ స్టేట్మెంట్ నమోదు సమయంలో కోర్టు ఇన్-కెమెరా ప్రొసీడింగ్ విధానాన్ని అనుసరించింది. తద్వారా దినేశ్ చెప్పిన విషయాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement