ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఫిబ్రవరి 26న ఈ కేసులో అరెస్ట్ అయ్యారు సిసోడియా. అప్పటి నుంచి బెయిల్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఉపశమనం దొరికింది. సీబీఐ సహా ఈడీ కేసులోనూ బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని కండీషన్ పెట్టింది సుప్రీంకోర్టు.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీడ్ ట్రయల్ కు ఆయనకు హక్కు ఉందని తేల్చి చెప్పింది. “దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. స్పీడీ ట్రయల్కి వెళ్లే హక్కు ఆయనకు ఉంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు ఆయనకు ఈ హక్కు కల్పించాల్సింది” అని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
బెయిల్ ఇస్తూ కోర్టు కొన్ని కండీషన్స్ పెట్టింది. సాక్ష్యులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడది తేల్చి చెప్పింది. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. అంతకు ముందు ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టు సిసోడియాకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆయన వాదనను పట్టించుకోవాల్సింది అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఆప్ నేత సంజయ్ సింగ్ కు ఇదే కేసులో బెయిల్ లభించింది. ఆ తరవాత సిసోడియాకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినప్పటికీ అది కేవలం ఈడీ కేసులో పరిమితమైంది. సీబీఐ కేసులో మాత్రం ఆయన ఇంకా కస్టడీలోనే ఉన్నారు.
బెయిల్ మంజూరు చేసే సమయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. లీగల్ ప్రొసీజర్స్ ఏవైనా న్యాయం చేయడంలో ఆలస్యం చేయకూడదని స్పష్టం చేసింది. స్పీడీ ట్రయల్కి అందరికీ హక్కు ఉంటుందని, ఇలాంటి కేసులలో ప్రతి రోజూ విలువైనదే అని వెల్లడించింది. బెయిల్ అనేది రూల్ అని..అలాంటప్పుడు ఈ విషయంలో ఎందుకు ఆలస్యం జరిగిందంటూ కింది కోర్టులను మందలించింది. ట్రయల్ పూర్తయ్యేంత వరకూ జైల్లోనే ఉంచడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే అవుతుందని తేల్చిచెప్పింది.