న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టై జైల్లో ఉన్న వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్ళై బెయిల్ పిటిషన్‌ను గురువారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. పిళ్ళై దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్ట్ జడ్జి ఎంకే నాగ్‌పాల్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. తీర్పు కాపీలో బెయిల్ వ్యతిరేకిస్తూ ఈడీ చేసిన వాదనలను ప్రస్తావించారు. అవి దర్యాప్తు సంస్థ ఆరోపణలే అయినప్పటికీ కేసులో మెరిట్స్ జోలికి వెళ్లకుండా తీర్పునిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇదే కేసులో ఇతర నిందితులకు కూడా సాధారణ బెయిల్ తిరస్కరించిన విషయాన్ని జడ్జి ఉదహరించారు. ఈ కేసులో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, బినొయ్ బాబు, శరత్‌చంద్ర రెడ్డి, మాగుంట రాఘవ, మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను స్పెషల్ కోర్టు తిరస్కరించింది.
తీర్పు కాపీలో ప్రస్తావించిన ఈడీ వాదనల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన ఆరోపణలున్నాయి. మద్యం వ్యాపారంలో కవిత తరఫున ప్రతినిధిగా అరుణ్ పిళ్ళై వ్యవహరించారని ఈడీ పేర్కొంది. సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ సంస్థలో కవితకు 32.5% వాటా ఉందని, రికార్డుల్లో మాత్రం కవిత తరఫున పిళ్ళై ఉన్నారని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇండో స్పిరిట్స్ సంస్థ రూ. 192 కోట్ల మేర లబ్ధి పొందిందని పేర్కొంది. కవిత ప్రతినిధిగా ఉన్న పిళ్ళై ఇండో స్పిరిట్స్ లో రూ. 3.40 కోట్లు పెట్టుబడితో హోల్‌సేల్ మద్యం వ్యాపారం ద్వారా రూ.32.86 కోట్ల లాభాలను ఆర్జించారని వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ లో పిళ్ళై పెట్టుబడుల్లో కొన్ని నిధులను కవిత సమకూర్చారని తెలిపింది.
ఇండో స్పిరిట్స్ లో వాటా కింద వచ్చిన లాభాల సొమ్ముతో హైదరాబాద్ లో కవిత భూములు కొనుగోలు చేశారని ఆరోపించింది. ముడుపుల వ్యవహారంలో కవిత, విజయ్ నాయర్ మధ్య చర్చలు జరిగాయని పేర్కొంది. శరత్‌చంద్ర రెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత సౌత్ గ్రూప్ సభ్యులుగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. రూ. 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో చెల్లించారని, లిక్కర్ పాలసి ముసాయిదా దశలో ఉండగా నిందితుల మధ్య నేరపూరిత కుట్ర జరిగిందని తెలిపింది. మద్యం పాలసీ రూపకల్పనలో ఉన్న రాజకీయ నాయకులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ముందుగానే భారీ మొత్తంలో డబ్బు చెల్లించారని వెల్లడించింది.
అందుకు ప్రతిఫలంగా కిక్ బ్యాక్స్ అదనపు క్రెడిట్ నోట్లు, నగదు లావాదేవీల ద్వారా L-1 లైసెన్స్‌లను కలిగి ఉన్న హోల్‌సేలర్ల వ్యాపారంలో భాగస్వాములయ్యారని వివరించింది. మొత్తంగా ఈ కుంభకోణం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2,873 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. ఇక అరుణ్ పిళ్ళై సౌత్ గ్రూప్ ప్రతినిధిగా లిక్కర్ పాలసీ రూపకల్పన కోసం జరిగిన వివిధ సమావేశాల్లో పిళ్ళై పాల్గొన్నారని వెల్లడించింది. కవిత హోల్‌సేల్‌లో వ్యాపారంలో డమ్మీ భాగస్వామిగా ఉన్నారని ఆరోపించింది. మనీ లాండరింగ్ లో పిళ్ళై పాత్ర ఉందనడానికి వివిధ డాక్యుమెంట్లతో పాటు వాంగ్మూలాల రూపంలో సాక్ష్యాధారాలున్నాయని ఈడీ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో అరుణ్ పిళ్ళైకి బెయిల్ ఇవ్వలేమని స్పెషల్ కోర్ట్ తేల్చి చెప్పింది.