బెయిల్ మంజూరు విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎఫ్ఐఆర్లు వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ, హైకోర్టులు, సెషన్స్ కోర్టులు నిందితులకు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వొచ్చని సోమవారం నాడు స్పష్టంచేసింది. రాజస్థాన్లో ఒక మహిళ దాఖలు చేసిన వరకట్న డిమాండ్ ఫిర్యాదుపై బెంగళూరు జిల్లా కోర్టు భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కేసును జస్టిస్ బి.వి.నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భయాన్లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
ఈ సందర్భంగా ధర్మాసనం హైకోర్టులు, సెషన్ కోర్టులకు ముఖ్యమైన ఆదేశాలిచ్చింది. తమ అధికార పరిధిలో నేరం జరగనప్పటికీ నిందితుడికి ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చు. నిందితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వరకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పౌరుల స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకునేటప్పుడు కోర్టులు పరిమిత మధ్యంతర రక్షణను అందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ మంజూరుపై ధర్మాసనం కొన్ని షరతులు విధించింది.
అటువంటి రక్షణ కోసం మొదటి తేదీన దర్యాప్తు అధికారి, ఏజెన్సీకి నోటీసు ఇవ్వాలని చెప్పింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసేటప్పుడు ప్రాదేశిక సామీప్యాన్ని నిర్దారించుకోవాల్సిన అవసరాన్ని కోర్టు తీర్పు నొక్కిచెప్పింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు నిందితులు వేరే రాష్ట్రానికి వెళ్లలేరని, అలా చేయడానికి వారికి స్పష్టమైన కారణం ఉండాలని బెంచ్ స్పష్టంచేసింది. ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో గతంలో వివిధ హైకోర్టులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది.