అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెజాన్-ఫ్యూచర్ గ్రూపు మధ్య 2019లో కుదిరిన ఒప్పందాన్ని సీసీఐ(కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) రద్దు చేసింది. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థ అనుమతి కోరిన సమయంలో వాస్తవ సమాచారాన్ని దాచిపెట్టారని, ఈ కారణంగానే ఈ డీల్‌ను రద్దు చేస్తున్నట్టు సీసీఐ ప్రకటించింది. అమెజాన్‌కు రూ.200 కోట్ల జరిమానా విధించినట్టు పేర్కొంది. ఫ్యూచర్ – అమెజాన్ మధ్య ఒప్పందాన్ని రద్దు చేస్తూ సీసీఐ 57 పేజీల ఆర్డర్‌ను విడుదల చేసింది. ఒప్పందాన్ని తాజాగా మరోసారి పరిశీలించాలి. అప్పటివరకు ఒప్పందానికి 2019లో ఇచ్చిన అనుమతి నిలుపుదల స్థితిలోనే ఉంటుందని పేర్కొంది. ఒప్పందానికి అనుమతులు కోరే విషయంలో అమెజాన్ అబద్దపు, అసత్య ప్రకటనలు చేసిందని సీసీఐ ఆర్డర్ పేర్కొంది. ఈ ఆదేశాలు అందుకున్న 60 రోజుల వ్యవధిలోనే రూ.200 కోట్ల మోనిటరీ జరిమానా చెల్లించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
మరోవైపు నోటీసులు అందుకున్న 60 రోజుల్లోపు ఫామ్ 2 రూపంలో నోటీసులు సమర్పించాలని సీసీఐ కోరింది. ఆ నోటీసులకు గడువు తీరిపోయే వరకు నవంబర్ 28, 2019లో ఇచ్చిన ఒప్పంద అనుమతులు నిలుపుదల స్థితిలోనే ఉంటాయని సీసీఐ పేర్కొంది. ఈ అనూహ్య నిర్ణయంతో రిలయన్స్- ఫ్యూచర్ రిటైల్ మధ్య ఒప్పందం రద్దుకు న్యాయపరమైన పోరాటం చేస్తున్న అమెజాన్‌కు ఇకపై ఆ అవకాశం దూరమయినట్టయింది. కాగా 2019లో ఫ్యూచర్ గ్రూప్‌లో అమెజాన్ గ్రూపు 200 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఫ్యూచర్ రిటైల్ అసెట్స్‌ను ఇతర కంపెనీలకు విక్రయించకుండా బ్లాక్ చేయడమే లక్ష్యంగా అప్పట్లో ఈ పెట్టుబడిపెట్టింది. కానీ ఫ్యూచర్ రిటైల్ తన 3.4 బిలియన్ డాలర్ల విలువైన తన ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కి విక్రయించింది. దీంతో మైనర్ వాటాదారుగా ఉన్న తమను సంప్రదించకుండా రిల్ – ఫ్యూచర్ రిటైల్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలని అమెజాన్ న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
విదేశీ ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు
కాగా ఫ్యూచర్ రిటైల్- అమెజాన్ మధ్య 2019లో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే విదేశీ ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అమెజాన్ వ్యాఖ్యానించింది. దేశీయ రిటైల్ వ్యాపారం రిలయన్స్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. రిటైల్ కంపెనీల మధ్య పోటీ ఉండదని ఇటివలే సీసీఐకి సమర్పించిన లీగల్ డాక్యుమెంట్‌లో అమెజాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. రిలయన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కోసమే ఫ్యూచర్ రిటైల్ ప్రయత్నిస్తోందని, ఇండియన్ రిటైల్ మార్కెట్‌లో పోటీ లేకుండా నియంత్రించాలని భావిస్తున్నాయని అమెజాన్ పేర్కొంది. కాగా భారత రిటైల్ మార్కెట్‌పై ఆధిపత్యం కోసం ప్రపంచ కుబేరులు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, రిల్ అధినేత ముకేష్ అంబానీ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 13 వేలకుపైగా ఔట్‌లెట్లతో రిలయన్స్ రిటైల్ నంబర్ 1 స్థానంలో ఉంది. 1500 ఔట్‌లెట్లతో ఫ్యూచర్ రిటైల్ రెండో స్థానంలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital