Friday, November 22, 2024

ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు.. హిండెన్‌బర్గ్ అంశంపై మూడోరోజూ విపక్షాల పట్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మూడోరోజూ హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదికపై సోమవారం విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి. బీఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం బీఆర్‌ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్, పోతుగంటి రాములు, వద్దిరాజు రవిచంద్ర న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అదానీ వ్యవహారంపై చర్చ జరపకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నుంచి పారిపోయిందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఎద్దేవా చేశారు. మూడు రోజులుగా చర్చ జరగాలని ఉభయ సభల్లో రూల్ 267 కింద వాయిదా తీర్మానం ఇస్తున్నా చర్చ జరపడం లేదని ఆరోపించారు.

ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా  వ్యవహరించకుంండా ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. సభ ఆర్డర్‌లో లేదని సాకు చెప్తూ వాయిదా తీర్మానాలను పరిగణనలోకి తీసుకోకుండా చర్చ జరగనివ్వకుండా తప్పించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అదానీ నరేంద్ర మోదీ స్నేహితుడు కాబట్టి  పార్లమెంట్‌లో చర్చ జరగనివ్వరని నొక్కి చెప్పారు. తమ పరిధిలోనే షేర్లు కొనుగోలు చేశారంటున్నారని, ఆ పరిధి పరిమితిపై చర్చ జరపాలని కోరుతున్నామన్నారు. ఏపీలో పోర్టులు, ముంబై ఎయిర్‌పోర్టు అదానీకి కట్టబెట్టారని, కేసులు పెట్టించి జీవీకే ముంబై ఎయిర్ పోర్టు నుంచి తప్పుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. అదానీకి సంబంధించి అనేక అంశాలు చర్చకు రావాల్సి ఉందనే తాము చర్చ చేపట్టాలని కోరుతున్నామన్నారు. అదాని షేర్ల ధర పెంచి చూపడం,షేర్లు పడిపోవడంతో పాటు అలాగే ఆయన తక్కువ సమయంలో అధిక ధనవంతుడుగా ఎలా ఎదిగారో  చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని దోచుకుంటుంటే దర్యాప్తు, చర్చ జరపరా అంటూ కేకే ప్రశ్నించారు. చర్చ జరిగితే షేర్లు పడిపోతాయని చర్చ జరగనివ్వడం లేదని అభిప్రాయపడ్డారు.

ప్రోత్సహించండి-మరింత అభివృద్ధి చూపిస్తాం : నామా నాగేశ్వరరావు, లోక్ సభ పక్ష నేత

- Advertisement -

దేశ సమస్యలపై చర్చ జరగాలని అందరూ భావిస్తారని, పార్లమెంట్ నిబంధనల ప్రకారం సమస్యలపై చర్చ కోరే హక్కు ప్రతి సభ్యునికి ఉందని ఖమ్మం ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. విపక్షాలు కూడా తమతో పాటే నోటీసులు ఇచ్చారని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే, ఎలాంటి తప్పు చేయకపోతే తమ కంటే ముందే కేంద్రం చర్చ కోరాలని ఆయన అన్నారు. రూ.2లక్షల 90 కోట్తో రైతులు, పేదల బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టారని హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్ ఉందని వివరించారు. సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునే వారికి రూ.3.లక్షల ఇచ్చేలా బడ్జెట్‌లో ప్రతిపాదించారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి బడ్జెట్ లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కారణంగానే ఇంత పెద్ద బడ్జెట్ అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రతి ఏడాది లక్ష ఉద్యోగాలు ఇస్తున్నామని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప తిరిగి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రాజీవ్ గుప్తా అనే లక్నోలో పుట్టి పెరిగిన వ్యాపారి తనతో విమానంలో ప్రయాణిస్తూ… తాను హైదరాబాద్‌‌లోనే స్థిరపడ్డానని, నగరం ఎంతో అభివృద్ధి చెందుతోందని సంతోషం వ్యక్తం చేశారని నామా నాగేశ్వరరావు ఉదహరించారు. అన్ని వర్గాల ప్రజలను హైదరాబాద్ సిటీ అక్కున చేర్చుకుంటుందని ఆయన వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణకు 50 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రం మెలికపెడితే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆయన వెల్లడించారు. తలసరి ఆదాయంలో తెలంగాణా నంబర్ వన్ స్థానంలో ఉందని… గ్రామ, పట్టణాభివృద్ధి జరగడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. నిధులు ఇవ్వకున్నా తాము అభివృద్ధి సాధిస్తున్నామని, ఇచ్చి ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. రైతుల రాజ్యం రావాలని నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. మంగళవారం కూడా నోటీసులిస్తామని, ప్రభుత్వం చర్చ జరిపే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

ఆ ఎంపీకో సమాధానం, నాకో జవాబు : ఎంపీ బీబీ పాటిల్

కేంద్ర బడ్జెట్ రైతు, పేదల వ్యతిరేకంగా ఉందని ఎంపీ బీబీ పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బడ్జెట్ అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఉందని తెలిపారు. గిరిజన యూనివర్సిటీ విషయంలో కేంద్రం తనకు వింత సమాధానం ఇచ్చిందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు గిరిజన యూనివర్సిటీ ఫైల్ ఆర్థిక శాఖ వద్ద ఉందని చెప్పారని, ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన ఏదీ అందలేదని కేంద్ర మంత్రి జవాబిచ్చారని బీబీ పాటిల్ వెల్లడించారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు పునర్విభజన చట్టంలోనే ఉందని ఆయన చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత త్వరగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement