Tuesday, November 26, 2024

Delhi | బీజేపీతో బాబు పొత్తు సిగ్గుచేటు : వీవీ లక్ష్మీనారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం సిగ్గుచేటు అని జైభారత్ పార్టీ అధినేత, సీబీఐ మాజీ జేడీ, వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం ఢిల్లీలో ప్రత్యేక హోదా సాధన సమితి ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్న ఆయన చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు. గతంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో బీజేపీకి దూరమైన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హోదా ఇవ్వకపోయినా సరే మళ్లీ ఎందుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు.

చంద్రబాబు నాయుడుకు రాజకీయాలే ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు కాదని దుయ్యబట్టారు. మరోవైపు బీజేపీ పై కూడా విమర్శలు చేసిన లక్ష్మీనారాయణ, రామరాజ్యం అంటే ధర్మాన్ని నిలబెట్టడం, ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండడమని అన్నారు. ఏపీకి ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని అడిగిన బీజేపీయే ఇప్పుడు అధికారంలో ఉందని, అయినా సరే ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం అని, అక్కడ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ సైతం చట్టంలో లేదు కాబట్టే ప్రత్యేక హోదా రావడం లేదని చెప్పడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ఎన్ని అవకాశాలు వచ్చినా జారవిడుచుకున్నారని, బిల్లులకు మద్దతు తెలిపే సమయంలో పట్టుబట్టి ఉండాల్సిందని అన్నారు. ఇప్పటికైనా బడ్జెట్ ఆమోదం తెలపకపోతే పార్లమెంట్ నిలిచిపోతుందని, ఉద్యమిస్తేనే విభజన హామీలు అమలవుతాయని అన్నారు.

ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, విద్యార్థి సంఘాలు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ధర్నా నిర్వహించారు. “ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు” అంటూ నినదించారు. అదే సమయంలో ఏపీ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ బస చేస్తున్నారన్న సమాచారం తెలుసుకుని ఆయన్ను కలిసేందుకు అనుమతి కోరారు. సాయంత్రం గం. 6.00కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో తిరిగి వచ్చారు. మూడు రోజుల పాటు ఏపీ సమస్యలపై ఢిల్లీలో వివిధ రూపాల్లో పోరాటాలు, నిరసన ప్రదర్శనలు, సెమినార్లు నిర్వహిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు వెల్లడించారు.

సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. గత 9 ఏళ్లుగా ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతున్నామని, 1,500 రోజులుగా అమరావతి రాజధాని కోసం పోరాడుతున్నామని గుర్తుచేశారు. మూడేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు. విభజన హామీలు అమలు పరచకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మోడీ హ్యాట్రిక్ సాధించడం సంగతేమోగానీ తమ నెత్తిన బండరాయి వేశారని నిందించారు. విభజన హామీల అమలు కోసం అన్ని రాజకీయ పార్టీలు పోరాడాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement