లక్నో: ఉత్తర ప్రదేశ్ లో అధికారం దక్కించుకునేందుకు వివిధ పార్టీలతో పొత్తుల మీద పొత్తులు కుద్రుచ్కుంటున్నసమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన బాబాయ్ తో ఉన్న విభేదాలకు తెరదించి కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ – పీఎస్ పీ (లోహియా) అధ్యక్షుడు, చిన్నాన్న శివపాల్ సింగ్ యాదవ్ తో ఈ మేరకు అవగాహనకు వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్ లో అఖిలేష్ వెల్లడించారు. ఇద్దరూ కలసి ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించేందుకు ప్రాంతీయ పార్టీలతో పొత్తు ప్రయత్నాలు కొనసాగుతాయని, పీఎస్ పీ తో పొత్తు ఖరారైందని గురువారం అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
శివపాల్ సింగ్ యాదవ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన అనంతరం ఆయన పొత్తు విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చర్చల అనంతరం శివపాల్ సింగ్ ఇంటి బయట ఇరు పార్టీల నేతలు, శ్రేణులు పెద్దఎత్తున గుమిగూడాయి. చాచా – భాటిజా జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తాయి. శివపాల్, అఖిలేష్ చర్చలకు కొద్దిసేపు ముందు ఎస్ పీ మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, అఖిలేష్ తండ్రి శివపాల్ ఇంటికి వచ్చినట్లు తెలిసింది. 2016లో శివపాల్, అఖిలేష్ మధ్య అభిప్రాయబేదాలు పొడసూపాయి. 2017లో జనవరిలో అఖిలేష్ ఎస్ పీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో తన హోదా, ప్రాధాన్యం తగ్గడంతో శివపాల్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కాగా అఖిలేష్, శివపాల్ పార్టీల మధ్య పొత్తువల్ల తమకు ఏమీ నష్టం జరగదని, తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని బీజేపీ నేత, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అభిప్రాయ పడ్డారు.