వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇవ్వాల ఒక ప్రకటన జారీ చేసింది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు బీఎస్సీ నర్సింగ్ సీట్లను ఎంసెట్ మెరిట్ ఆధారంగా చేపడుతూ యూనివర్సిటీ ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియ చేపట్టింది. ఇటీవల ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఉన్న ఎంసెట్ క్వాలిఫైయింగ్ పర్సంటైల్ ప్రమాణాలను ఈ ఏడాదికి సడలించింది.
బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ఎంసెట్ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులను చేర్చుకోవడం ద్వారా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సడలింపు ఈ ఏడాది ప్రవేశాలకు మాత్రమే అని ఐఎన్‌సీ ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది. ఈ మేరకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం దరఖాస్తుకు మరోసారి అవకాశం కలిపిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఎంసెట్ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ ఉదయం 8 గంటల నుండి 12వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత, ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.