Friday, November 22, 2024

Delhi: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సాక్షిగా హక్కుల పోరాటం.. దేశ రాజధానిలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృతో మహోత్సవ్ నిర్వహిస్తున్న సందర్భంగా బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు ప్రకటించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా గణనలో కులగణన చేయాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో పార్లమెంటును ముట్టడించారు. పార్లమెంటు వైపు దూసుకు వస్తున్న నాయకులను కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద బ్యారికేడ్లు అడ్డం పెట్టి ఆపారు. అంతకుముందు బీసీలు భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా నుంచి వేలాదిమంది బీసీలు తరలివచ్చారు. వెనుకబడిన వర్గాల వారి ఉద్యమానికి వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఎంపీలు సంతోష్ కుమార్, చింతా అనురాధ, బీద మస్తాన్‌రావు, మార్గాని భరత్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆందోళనలో పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, కర్రి వేణు మాధవ్ సహా అనేక మంది ధర్నాకు నాయకత్వం వహించారు. తమ డిమాండ్లకు కేంద్రం తలొగ్గకపోతే తిరుగుబాటు తప్పదని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ప్రజస్వామ్య దేశంలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని కోరారు.

అప్పుడే సమైక్యత, సమగ్రత, శాంతి నెలకొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీలకు రాజ్యాంగబద్దమైన హక్కులు – వాటా కల్పించవలసిన సమయం ఆసన్నమైనదని ఆయన నొక్కి చెప్పారు. ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీ0లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి చట్టాన్ని చేయాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలలో ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
బహుజన చక్రవర్తి, రాజర్షి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 372 వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీలో ఘనంగా నిర్వహించింది. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషి చేస్తామని అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ తెలిపారు. గోల్కొండ ఖిల్లాపై బహుజనుల జెండా ఎగరేసిన ధీశాలి సర్వాయి పాపన్న అని కొనిడాయారు. ఎంపీలు మార్గాని భరత్, ఆర్. కృష్ణయ్య, మాజీ ఎంపీ వీహెచ్, సూదగాని పౌండేషన్ ఛైర్మన్ హరిశంకర్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బహుజనులంటే పాలితులు కాదు, పాలకులని మూడున్నర శతాబ్దాల కిందటే నిరూపించిన మహనీయుడు పాపన్న అని వారు గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితో బహుజనులంతా ఏకమై తమ హక్కుల కోసం పోరాడి, విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement