న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఆరోగ్య ఉపకేంద్రాలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలేంటి? గత ఐదేళ్లలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల వివరాలు వెల్లడించాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవీయ శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద మాతా శిశు ఆరోగ్య సేవలతో పాటు నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులకు చికిత్స , ఉచితంగా అవసరమైన మందులను అందజేస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల మద్దతుతో 1.5 లక్షల ఉపకేంద్రాలు , ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాలుగా మార్చామన్నారు. జూన్ 30, 2022 నాటికి దేశంలో మొత్తం 1,20,112 ఆయుష్మాన్ భారత్ వెల్‌నెస్ కేంద్రాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సాయాన్ని కేంద్రం అందజేస్తోందన్న కేంద్రమంత్రి, తెలంగాణలో 4067 , గుజరాత్ 7647 , ఆంధ్రప్రదేశ్ 9106 , మహారాష్ట్రలో 10514 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు.
అమృత్‌తో చిన్న పట్టణాల అభివృద్ధి..
దేశంలో చిన్న పట్టణాలు, బ్లాక్ , మండల ప్రధాన కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ఏమైనా ప్రణాళిక ఉందా? నిధులు కేటాయింపు వివరాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అందజేస్తున్న ఆర్థిక సాయం గురించి తెలియజేయాల్సిందిగా నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర గృహ , పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కౌశల్ కిషోర్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అమృత్ 2.0 మిషన్‌ను అక్టోబర్ 1, 2021 న ఐదేళ్ల కాల పరిమితితో ప్రారంభించామని తెలిపారు. 2021 – 22 నుంచి 2025-26 నాటికి భారీ అంచనాలతో ఈ పథకాన్ని రూపొందించినట్టు చెప్పుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.