న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో ఆయుష్ పరిశ్రమ మార్కెట్ సైజు ఒక లక్షా 49 వేల 451 కోట్ల రూపాయలకు చేరిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయుష్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ రాతపూర్వకంగా జవాబిచ్చారు. భారతీయ సాంప్రదాయ వైద్య వేదిక (ఫోరం ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్) ఆయుష్ రంగంపై జరిపిన పరిశోధనా నివేదిక ప్రకారం 2014-15లో 23 వేల 532 కోట్లు ఉన్న ఆయుష్ మార్కెట్ 2020 నాటికి ఒక లక్షా 49 వేల 451 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు తెలిపారు. ఆయుష్ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. అందులో భాగంగా భారతీయ ఆయుష్ తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు తమ ఎగుమతులను మరింత వృద్ధి చేసుకునేందుకు వీలుగా పలు రకాల చర్యలు చేపడుతోందని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఆయుష్ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం, ఆయుష్ వైద్య విధానానికి అంతర్జాతీయ గుర్తింపు సాధించడం, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు, అంతర్జాతీయంగా ఆయుష్ మార్కెట్‌ను అభివృద్ధి చేయడం, వివిధ దేశాలలో ఆయుష్ అకడమిక్ చైర్లు ఏర్పాటు చేస్తూ ఆయుష్‌లో అకడమిక్స్, పరిశోధనలను ప్రోత్సహించడం, శిక్షణ, వర్క్ షాప్‌లను నిర్వహించడం ద్వారా ఆయుష్ వైద్య చికిత్సా విధానాలపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహనను కల్పించడం వంటి చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి, సోవా రిగ్పా వైద్య విధానాలకు సంబంధించిన మందులు ఇతర ఉత్పాదనల ఎగుమతుల కోసం ఆయుష్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
అలాగే ఆయుష్ వైద్య విధానాన్ని అంతర్జాతీయంగా ప్రోత్సహించేందుకు వేర్వేరు దేశాలతో 24 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయుష్ విధానాలపై పరిశోధనలు, అధ్యయనంపై సహకారం కోసం వివిధ అంతర్జాతీయ సంస్థలతో 40 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి చెప్పారు. ఆయుష్ అకడమిక్ చైర్స్ నెలకొల్పేందుకు 15 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే 35 దేశాలలో ఆయుష్ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ 39 ఎంఓయూలను కుదుర్చుకుందని అన్నారు. 31 ఆయుర్వేద డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియో మందులను ఎగుమతి చేసుకునేందుకు డబ్ల్యుహెచ్ఓ-జీఎంపీ అందించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
దేశంలో రెండు డబ్ల్యుహెచ్వో కొలాబరేటివ్ సెంటర్లు..
ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహిచండంలో బాగంగా ఆయుష్ సెంటర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపును ఇచ్చిందా, ఆయుష్ విద్యలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వివరాలపై ఎంపీ విజయసాయి రెడ్డి అగిడిన ప్రశ్నకు ఆయుష్ మంత్రి శర్బానంద సోనోవాల్ రాతపూర్వకంగా జవాబిస్తూ ఆయుష్ వైద్య విధానంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో రెండు కోలాబొరేటివ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, గురజాత్‌లోని జామ్‌నగర్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసర్చ్ ఇన్ ఆయుర్వేద ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ప్రాజెక్ట్ కొలేబోరేషన్ ఒప్పదంలో భాగంగా నాలుగు డబ్య్లూహెచ్‌వో బెంచ్‌మార్క్ డాక్టుమెంట్లను రూపొందించడం ప్రాంరభించిందని ఆయన వెల్లడించారు. భారతీయ వైద్య విధానంలో నాణ్యమైన, అందరికీ అందుబాటులో ఉండేలా విద్యా బోధన జరిగేలా దేశంలోని అన్ని ప్రాంతాల్లో నైపుణ్యం, ప్రావీణ్య కలిగిన మెడికల్ ప్రొఫెషనల్స్‌ను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతిని ఏర్పాటు చేసిందని అన్నారు.
ఆలాగే ఎన్సీఐఎస్ఎం-2020 ప్రకారం కమిషన్ ఫర్ బోర్డ్ ఆఫ్ ఆయుర్వేద, బోర్డ్ ఆఫ్ యునాని, సిద్ధ, రోవ రిగ్ప ఏర్పాటు జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధిత వ్యవహారాల కోసం మెడికల్ అసెస్మెంట్, రేటింగ్ బోర్డు అలాగే బోర్డ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ వంటి ప్రత్యేక బోర్డులను కూడా తమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని మంత్రి అన్నారు. అలాగే ఎన్ సీ హెచ్-2020 ప్రకారం హోమియోపతి సిస్టంలో విద్యా సంబందిత వ్యవహారాల కొరకు హోమియోపతి ఎడ్యుకేషన్ బోర్డు పేరుతో ప్రత్యేక అటానమస్ బోర్డు ఏర్పాటు చేసినట్లు సోనోవాల్ తెలిపారు. అలాగే ఆయుష్ విద్యా నాణ్యత పర్యవేక్షించేందుకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సల్లో అడ్మిషన్ల కొరకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ హెల్త్ కేర్ సిస్టంలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ 5 అటానమస్ సంస్థలను స్థాపించినట్లు కేంద్రమంత్రి వివరించారు.