Monday, November 25, 2024

పల్లె దవాఖానాల్లో ఆయుష్‌ వైద్యులు.. అల్లోపతి వైద్యంలోనూ శిక్షణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పల్లె దవాఖానాల్లో పనిచేసేందుకు ఎంబీబీఎస్‌ వైద్యులు ముందుకు రావడం లేదు. దీంతో ఆయూష్‌ వైద్యులతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఆయూష్‌ వైద్యులకు అలోపతి వైద్యంలో ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫలితంగా ఆయూష్‌ వైద్యులతో పల్లె దవాఖానాలకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో వైద్యం అందించేందుకు ఆస్కారం కలగనుంది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు 3500 దాకా పల్లె దవాఖానాలు ఏర్పాటవుతున్నాయి.

కొద్ది రోజుల్లో 2వేల పల్లె దవాఖానాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అయితే వీటల్లో కేవలం1200 దాకా ఆసుపత్రుల్లో మాత్రమే ఎంబీబీఎస్‌ వైద్యులు అందుబాటులో ఉన్నారు. పల్లె దవాఖానాల్లో పనిచేసేందుకు ఎంబీబీఎస్‌ వైద్యులు ముందుకు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. రూ.40వేల జీతానికి మారుమూల పల్లెల్లో పనిచే యాలంటే ఎంబీబీఎస్‌ వైద్యులు ఆసక్తి చూపడం లేదు. చిన్నపాటి ప్రయివేటు ఆసుపత్రిలో పనిచేసినా అంతకంటే ఎక్కువ జీతం వస్తుండడంతోపాటు ఉన్నత విద్యను చదివేందుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పల్లె దవాఖానాల వైపు ఎంబీబీఎస్‌ వైద్యులు చూడడం లేదని తెలుస్తోంది.

- Advertisement -

పల్లె దవాఖానాల్లో వైద్యులు,సిబ్బంది నియామకంతోపాటు పక్కా భవనం, ల్యాబ్‌, లేబర్‌ తదితర సదుపాయాలను కల్పిస్తే గ్రామీణులకు ఎంతో మేలు కలుగుతుందని వైద్య ఆరోగ్య సంఘాలు చెబుతున్నాయి. విష జ్వరాలతోపాటు ఇతర జబ్బులకు పల్లె దవాఖానాల్లోనే మెరుగైన ప్రాథమిక వైద్యం అందనుంది. పరిస్థితి తీవ్రంగా ఉన్న పేషెంట్లను సమీపంలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రులకు రెఫర్‌ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలకు మెరుగైన భవనాలను నిర్మించడంతోపాటు వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చే కార్యక్రమంలో నిమగ్నమైంది.

బస్తీ దవాఖానాలతో పట్టణ పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో విజయవంతమైన రాష్ట్ర్ర ప్రభుత్వం అదే స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యాన్ని ఉచితంగా సకాలంలో అం దించేందుకు పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తోంది. 24 గంటలూ పల్లె దవాఖానాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకు ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ )ను నియమించనుంది. పల్లె దవాఖానాల్లోనే మాతా శిశు సంరక్షణ వైద్యంతోపాటు బీపీ, షుగర్‌ వంటి అసంక్రమిత వ్యాధులకూ వైద్యం అందించనున్నారు. మూత్ర, రక్తపరీక్ష వంటి వ్యాధి నిర్ధారణా పరీక్షలను కూడా పల్లె దవాఖానాల్లోనే అందిచేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వ్యాధికి వైద్యంతోపాటు వ్యాధి నిర్దారణా పరీక్షల కోసం పట్టణాలకు లేదంటే ప్రయివేటుకు పరుగెత్తాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యాన్ని ఉచితంగా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement