నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు అందుబాటులోకి రావడం కరోనా రోగులకు ఉపశమనాన్ని కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ కృష్ణపట్నంలో ఓ వైద్యుడు కనిపెట్టిన ఆయుర్వేద మందు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో వైద్యుడు ఆనందయ్య తయారుచేసిన ఆయుర్వేద కరోనా మందుపై లోకాయుక్త విచారణకు ఆదేశించగా.. ఎలాంటి అభ్యంతరాలు లేవని జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. ఆయుర్వేద మందు తయారీ, ఆ మందు వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌పై కలెక్టర్ నివేదిక ఇచ్చారు. ఈ మందు వాడిన ప్రజలు ఆక్సిజన్ స్థాయి పెరిగినట్టు చెప్పారని, ప్రతి ఒక్కరూ ఆయుర్వేద మందుపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ మందు వల్ల ఇప్పటివరకు ఎవరు ఎలాంటి ఇబ్బంది పడలేదని, ఇక్కడి వచ్చిన రోగులు మందు తీసుకున్న తర్వాత కోలుకున్నారని నివేదికలో తెలిపారు.
దీంతో ఈ ఆయుర్వేద మందును శుక్రవారం నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు. ప్రకృతిలో దొరికే సహజసిద్ధ వస్తువులతో ఆనందయ్య తయారుచేసే ఆయుర్వేద మందుతో ఎటువంటి హాని ఉండదని, కరోనా రోగుల ఆరోగ్యం కూడా కుదుటపడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మందు కోసం నెల్లూరు జిల్లా నుంచే కాక ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వేల సంఖ్యలో తరలి వస్తుండటంతో అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లు, క్యూలైన్లతో పాటు, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామానికి వెలుపల పోలీసు ఔట్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.