బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైన వేళ అయోధ్య భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ విభాగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను రంగంలోకి దించారు. పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను మోహరించారు.
యాంటీ డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వెయ్యి సీసీ కెమెరాలతో అణువణువూ జల్లెడ పడుతున్నారు. సాధారణ దుస్తులు ధరించిన పలువురు పోలీసులు ప్రజల్లో కలిసిపోయి అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనే శక్తి ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయోధ్యకు రప్పించారు. అయోధ్యకు దారితీసే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసులో ప్రత్యేక రీడర్ కోడ్‌తో సరిపోలితేనే… లోపలికి అనుమతి ఇస్తున్నారు. క్యూఆర్ కోడ్ తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ, విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.