దీపావళి వేడుకలకు అయోధ్య నగరం ముస్తాబైంది. లక్షలాది దీపాలతో మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా దీపావళి పర్వదినానికి ముందు రోజు అయోధ్యలోని సరయూ నదీ తీరంలో ‘దీపోత్సవ్’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
గతేడాది ఏకంగా 25 లక్షల దీపాలు ఒకేసారి వెలిగించి అయోధ్యాపురి గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. ఈ ఏడాది 28 లక్షల దీపాలతో కొత్త రికార్డు నెలకొల్పాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 30న జరిగే దీపోత్సవ్ వేడుకలకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి.
మొత్తం 51 ఘాట్లలో, 30 వేల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రామ మందిరం నిర్మాణం తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ దీపోత్సవాన్ని మరింత అద్భుతంగా నిర్వహించాలని యూపీ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే రామ మందిర సముదాయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు.
బుధవారం సాయంత్రం 6:30 గంటలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సరయూకి హారతి ఇస్తారు. అనంతరం నది ఒడ్డున దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గిన్నిస్ ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ దీపాలను లెక్కిస్తారు. కార్యక్రమం అనంతరం లేజర్ షో కూడా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.