Friday, September 20, 2024

TG | రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి : మంత్రి పొన్నం

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : రోడ్డు భద్రతపై అవగాహక కలిగించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం రహదారి భద్రత-సుప్రీంకోర్టు కమిటీ తీసుకున్న నిర్ణయాల అమలుపై కమిషనర్‌ ఇలాంబరితి ఆధ్వక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ 2023లో రాష్ట్రంలో 22,903 ప్రమాదాలు జరిగాయని, వాటిలో 7,186 ప్రాణాంతక ప్రమాదాలు, 2,476 తీవ్ర గాయాలు, 10,404 చిన్న గాయాలు, 2,747 సాధారణ గాయాలు అయ్యాయని వివరించారు.

రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బ్లాక్‌ స్పాట్స్‌ ను గుర్తించామని, అక్కడ ప్రమాదాలు జరుగకుండా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.

సమన్వయంతో సాధ్యం..

రోడ్డు ప్రమాదాయాలను రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను అంబులెన్స్‌, అధికారుల మధ్య సమన్వయంతోనే తగ్గించవచ్చని కమిషనర్‌ ఇలాంబరితి పేర్కొన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ వంటి తీవ్రమైన రహదారి భద్రతా నేరాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అదే విధంగా చిన్న వయస్సు నుంచే రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ రహదారులపై పాదచారులు నడిచేందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మిస్తే రద్దీగా ఉండే ప్రమాదాలని తగ్గించవచ్చని పలువురు అధికారులు పేర్కొన్నారు.

ప్రతి నెల జిల్లాల్లో రోడ్‌ సేప్టీ కమిటీ సమావేశాలు భాగస్వామ్యంతో నిర్వహించాలని, రవాణా, పోలీసు, ఆర్‌అండ్‌బీ, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ విభాగాలు ప్రతినెలా జిల్లా రహదారి పురోగతిని సమీక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌, డీసీపీ ట్రాఫిక్‌ రాహుల్‌ హెగ్డే, జోయల్‌ డేవిస్‌, ఈఎన్సీ మోహన్‌ నాయక్‌, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ స్నేహ శభరీస్‌, జేటీసీ రమేష్‌, మమతా ప్రసాద్‌, డీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌…

రోడ్డు ప్రమాదాల నివారణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ కాన్ఫరెన్స్‌లో బ్లాక్‌ స్పాట్స్‌, అత్యవసర సేవలు, రోడ్డు భద్రతా చట్టాల అమలు, ట్రాఫిక్‌ పై అవగాహన కార్యక్రమాలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, రోడ్డు ప్రమాదాలు,రెగ్యులర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్‌ సేప్టీ కమిటీ సమావేశాలపై చర్చించారు.

ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌, అధికారుల సమన్వయం అనే అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.ఈ కాన్ఫరెన్స్‌లో రవాణాశాఖ, ట్రాఫిక్‌, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం,నేషనల్‌ హైవేస్‌ అథారిటీ- ఆఫ్‌ ఇండియా, రోడ్లుభవనాలశాఖ,జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement