Thursday, November 21, 2024

74 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు, రెండో విడత అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 74 మంది ప్రముఖులకు 2022 సంవత్సరానికిగానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్‌లో ఘనంగా రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. మరణానంతరం ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్‌ సింగ్‌ కుటుంబీకులకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణమూర్తి ఎల్లా, సుచిత్ర కృష్ణ ఎల్లా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అందుకున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం , విద్య, క్రీడలు,పౌర సేవల విభాగాలలో కృషి చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది.

2022 సంవత్సరానికి నాలుగు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది పద్మ అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు, 13 మంది మరణానంతర అవార్డు గ్రహీతలతో పాటు విదేశీయులు, ప్రవాస భారతీయులు ఉన్నారు. తొలి విడతగా ఈనెల 21వ తేదీన 64 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఇద్దరికి పద్మ విభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మంది పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement