మన దేశంలో బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సామాన్యుడు తీసుకున్న రుణాలను ముక్కుపిండి వసూలు చేసే బ్యాంక్‌లు బడాబాబుల నుంచి మాత్రం రుణాలు వసూలు చేసుకోలేకపోతున్నాయి. కొందరు ఇలా భారీగా రుణాలు తీసుకుని ఉద్దేశ్వపూర్వకంగానే ఎగవేసి, విదేశాలకు పారిపోయి జల్సాలు చేసుకుంటున్నారు. ఇలా రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగానే ఎగవేస్తున్న వారి సంఖ్య 2012 తరువాత పది రేట్లు పెరిగినట్లు ఒక నివేదిక స్పష్టం చేసింది. ఇలా ఇప్పటి వరకు 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలను బడాబాబులు ఉద్దేశపూర్వకంగానే ఎగవేశారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్ధ్యం ఉన్నప్పటికీ , అలా చేయకుండా ఎగ్గొట్టే వారిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి వారు రుణాలు దేని కోసం తీసుకున్నారో అందుకు ఖర్చు పెట్టకుండా తమ సొంత అవసరాలకు, సొంత ఆస్తులు పెంచుకునేందుకు మళ్లిస్తారు. దేని కోసం బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్నారో, ఆ వ్యాపారంలో నష్టం వచ్చిందని, కట్టలేమని చెప్పి ఎగవేస్తుంటారు.
ఇలా రుణాలు ఎగవేసిన వారిలో రిషి అగర్వాల్, అరవింద్ ధావన్ , ముఖుల్ చోస్కీ, సందేశరా బ్రదర్స్ ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. రిషి అగర్వాల్ ఏబీజీ షిప్పింగ్ పేరుతో కంపెనీ నడుపుతున్నారు. ఈయన 6,382 కోట్ల రుణాలను ఎగవేశారు. అరవింద్ ధామ్‌కు చెందిన ఆమ్‌టెక్ ఆటో కంపెనీ తీసుకున్న 5,885 కోటు తిరిగి చెల్లించలేదు. 2022 మార్చి 31 నాటికి 25 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణాలను ఎగవేసిన వారు 12 వేల మంది ఉన్నారు. సందేశరా బ్రదర్స్ నితిన్,చేతన్ కలిసి 3,757 కోట్ల రూపాయల రుణాలు ఎగవేశారు. వీరు స్టెర్లింగ్ గ్లోబల్ ఆయిల్ రిసోర్స్ పేరుతో ఈ రుణాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి కేటాయించిన 86,200 కోట్లతో పోల్చితే ఎగవేసిన రుణాలు 2.7 రెట్లు ఎక్కువ. దివాన్ హౌస్సింగ్ అధినేతలు కపిల్, ధీరజ్ వాద్వాన్, సంజయ్, సందీప్, మోహల్ చోమ్కీ సంజయ్ సురేకా, అతుల్ పంజ్ ఇలా వేల సంఖ్యలో బ్యాంక్ రుణాలు ఎగవేశారు. మొత్తం ఎగవేతకు గురైన రుణాల్లో 95 శాతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి తీసుకున్నవే ఉన్నాయి. ఇందులో ఒక్క ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంక్‌లకు చెంది న రుణాలే 30 శాతం ఉన్నాయి.
పేన పేర్కొన్న ఎగవేతలో విజయ్ మాల్యా, మోహల్ చోమ్కీ నీరవ్ మోడీ తీసుకున్న రుణాలను కలపలేదు. వీరు విదేశాలకు పారిపోయారు. మన దేశంలో రుణాలు తీసుకున్న బడాబాబులు దర్జాగా విదేశాలకు పారిపోతారు, లేదంటే వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఎగవేతకు పాల్పడతారు. ఇవన్నీ బ్యాంక్‌లు చక్కగా ఎన్‌పీఏ అంటే నిరర్ధక ఆస్తులుగా ప్రకటిస్తుంటాయి. అదే సామాన్యుడు రుణం తీసుకుంటే.. ఎటూ పారిపోలేడు, పెద్ద వాళ్లలా అబద్దాలు ఆడి తప్పించుకోలేడు. ఉన్న ఆస్తులు అమ్మి రుణం తీరుస్తుంటారు.. బ్యాంక్‌లకు రుణాలు ఎగవేసిన వారిపై సరైన చర్యలు తీసుకుంటే.. ఇలా ఎగవేతలను అరికట్ట వచ్చని చాలా కాలంగా చెబుతున్నా… ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇలాంటి వారి పేర్లను బహిరంగంగానూ ప్రకటించడంలేదు…
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.