న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని వివేక కుమార్తె డా. సునీత నర్రెడ్డి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాశ్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ఆమె స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మే 31న ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అవినాశ్ రెడ్డిపై మోపిన అభియోగాలన్నీ తీవ్రమైనవని, ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ జారీ చేయడం తగదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
దర్యాప్తు సంస్థ సీబీఐ మోపిన అభియోగాలను న్యాయస్థానం పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా వ్యతిరేకిస్తోంది. సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపడితే తమ అభిప్రాయాన్ని, వాదనలను వినిపించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. పిటిషన్‌ను త్వరగా విచారణకు స్వీకరించాలని కోరుతూ సునీత తరఫు న్యాయవాదులు బుధవారం సుప్రీంకోర్టులో ప్రస్తావించే అవకాశం ఉంది.