న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ (వైఎస్సార్సీపీ) వైఎస్ అవినాశ్ రెడ్డి దర్యాప్తు సంస్థకు ఏనాడూ సహకరించలేదని వివేక కుమార్తె డా. సునీత నర్రెడ్డి ఆరోపించారు. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను త్వరగా విచారణకు స్వీకరించాలని కోరుతూ ఆమె తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా శుక్రవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఎదుట ప్రస్తావించారు.
ఈ సందర్భంగా పిటిషన్‌ను విచారణకు స్వీకరించాల్సిన అవసరాన్ని వివరిస్తూ తీవ్రమైన హత్యానేరం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి దర్యాప్తు సంస్థ జారీ చేసిన సమన్లకు సహకరించలేదని అన్నారు. కొన్ని సందర్భాల్లో తల్లి అనారోగ్యం పేరు చెప్పి విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని సిద్ధార్థ్ లూత్రా ఆరోపించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక సూత్రధారి, కుట్రదారుడు అన్న ఆరోపణలు అవినాశ్‌పై ఉన్నాయని, ఆయనకు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా రిలీఫ్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు తొలుత నిరాకరించిందని గుర్తుచేశారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం “అవినాశ్ రెడ్డికి మంజూరైన యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారా?” అని ప్రశ్నించింది. హైకోర్టు మీడియా కథనాలను పరిగణలోకి తీసుకుని ఆదేశాలిచ్చిందని లూత్రా అన్నారు. ఈ క్రమంలో కేసును విచారణకు స్వీకరిస్తూ జూన్ 13 నాటి కేసుల జాబితాలో చేర్చాల్సిందిగా ఆదేశించింది.
ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మే 31న ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు జరిగిన కుట్రలో అవినాశ్ రెడ్డి పాత్రను నిరూపించేందుకు ప్రత్యక్ష సాక్ష్యాధారాలు ఏవీ లేవని, ఈ కేసు మొత్తం ఊహాగానాలు – ఆరోపణలపైనే ఆధారపడిందని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తులో జోక్యం చేసుకోవడం, సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సాక్షులను బెదిరించడం వంటి చర్యలకు అవినాశ్ పాల్పడినట్టు దర్యాప్తు సంస్థ సీబీఐ ఎప్పుడూ చెప్పలేదని, ఘటనాస్థలంలో రక్తపు మరకలు సహా సాక్ష్యాలను చెరిపేశారన్న ఆరోపణ మాత్రమే చేస్తోందని వెల్లడించింది.
ఈ పరిస్థితుల్లో అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం లేదని భావిస్తూ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు సింగిల్ జడ్జి మినీ ట్రయల్ నిర్వహించి కేసు మెరిట్‌పై వ్యాఖ్యలు చేశారని సునీత పేర్కొన్నారు. పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి ఎంపీగా ఉన్నందున సాక్షులను బెదిరించే పరిస్థితి ఉందని, పైగా ఆయన దర్యాప్తు సంస్థకు సహకరించలేదని గుర్తుచేశారు. జూన్ 13న జరిగే విచారణలో ఈ అంశాల ఆధారంగానే వాదనలు వినిపించనున్నారు. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా వ్యతిరేకిస్తున్నందున సునీతకు మద్దతుగా సీబీఐ కూడా వాదనలు వినిపించనున్నట్టు తెలిసింది.