హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపు, అటానమస్ హోదా దక్కించుకోవడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. దీనికి గానూ ఆయా కాలేజీలకు ప్రోత్సహిస్తున్నది. కనీసం తాత్కాలిక గుర్తింపునైనా సాధించాలని సహకరిస్తున్నది. అందుకు న్యాక్ గుర్తింపు కోసం సన్నద్ధమయ్యేందుకు కాలేజీలకు ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నది. ఈనేపథ్యంలోనే రెండు ప్రభుత్వ కాలేజీలకు న్యాక్ గుర్తింపు రాగా, ఏడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కినట్లు కళాశాల విద్య, సాంకేతిక విద్యశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. కామారెడ్డిలోని గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌కు సీజీపీఏ 3.22 పాయింట్లతో ఏ గ్రేడ్‌ను వచ్చే ఐదేళ్లవరకు దక్కించుకుంది. సత్తుపల్లి జేవీఆర్ గవర్నమెంట్ కాలేజీ సీజీపీఏ 3.03 పాయింట్లతో ఏ గ్రేడ్‌ను ఐదేళ్ల వరకు దక్కించుకుంది.
ఈమేరకు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సెల్ ఆయా కాలేజీలకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మరో ఎనిమిది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కినట్లు కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(మహిళా), నల్గొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (మహిళా), పాల్వంచా, నర్సంపేట్, విద్యానగర్, బిచుకొండ, కామారెడ్డి, సత్తుపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అటానమస్ హోదాను పొందాయి. దీంతో అటానమస్ హోదా ఉన్న మొత్తం కాలేజీలు 19కు చేరుకున్నాయి.