డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే ఆటో డెబిట్ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్(ఏఎఫ్) అవసరం లేని ఆటో డెబిట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న ఐదు వేల నుంచి 15 వేలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వినియోగదారులు ఎలాంటి ఓటీపీ నిబంధన లేకుండానే 15 వేల వరకు ఆటో డెబిట్ సదుపాయాన్ని ఇక నుంచి ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా విద్యుత్, గ్యాస్ బిల్లులతో పాటు, వివిధ రకాల యాప్స్‌కు నెల, సంవత్సర చందాలు చెల్లింపుల కోసం చాలా మంది వినియోగదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆటో డెబిట్ చెల్లింపులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్బీఐ గతంలో పలు నిబంధనలు తీసుకువచ్చింది. ఇలా ఆటో డెబిట్ విధానాన్ని వినియోగించుకున్న వారికి బ్యాంక్‌లు 24 గంటల ముందుగానే సమాచారం అందించాల్సి ఉంటుంది.
కస్టమర్ల అనుమతితోనే చెల్లిం పులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ నిబంధన ప్రకారం ఆటో డెబిట్ అవుతున్న మొత్తం, ఎవరికి చెల్లింస్తున్నామన్న సమాచారాన్ని కస్టమర్లుకు బ్యాంక్‌లు తెలియచేస్తున్నాయి. 5 వేలకు మించిన చెల్లింపులను ప్రస్తుతం ఓటీపీ విధానాన్ని ఉపయోగించి మాన్యువల్‌గా చేస్తున్నారు. కొత్త విధానం వల్ల ఇక నుంచి వినియోగదారులు నెలవారి స్కూల్ , ఇతర ఎడ్యుకేషన్ అవసరాల ఫీజులు, బీమా ప్రీమియం, 15 వేల వరకు ఉండే నెల వారి రుణాల వాయిదాల చెల్లింపులు ఆటో డెబిట్ విధానంలో జరిపే వెసులుబాటు ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.