Monday, November 4, 2024

AUS vs PAK | తొలి వ‌న్డే ఆసీస్ దే…

మెల్ బోర్న్ వేదికగా నేడు పాకిస్థాన్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (31 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. కమిన్స్‌కు మిచెల్‌ స్టార్క్‌ (2 నాటౌట్‌) సహకరించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. నసీం షా (39 బంతుల్లో 40; ఫోర్‌, 4 సిక్సర్లు), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (71 బంతుల్లో 44; 2 ఫోర్లు, సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు), షాహీన్‌ అఫ్రిది (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌), ఇర్ఫాన్‌ ఖాన్‌ (35 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.

అబ్దుల్లా షఫీక్‌ (12), సైమ్‌ అయూబ్‌ (1), కమ్రాన్‌ గులామ్‌ (5), అఘా సల్మాన్‌ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్‌ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడిన్లు ఉన్నాయి. కమిన్స్‌, జంపా, అబాట్‌, లబూషేన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. ఓ దశలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించింది. అయితే పాక్‌ బౌలర్లు మధ్యలో పుంజుకోవడంతో ఆసీస్‌ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, ఓటమి దిశగా పయనించింది. ఈ సమయంలో కమిన్స్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కమిన్స్‌తో పాటు స్టీవ్‌ స్మిత్‌ (44), జోష్‌ ఇంగ్లిస్‌ (49) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆసీస్‌ 33.3 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

- Advertisement -

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్‌ 1, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ 16, లబూషేన్‌ 16, ఆరోన్‌ హార్డీ 10, మ్యాక్స్‌వెల్‌ 0, సీన్‌ అబాట్‌ 13 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ 3, షాహీన్‌ అఫ్రిది 2, నసీం షా, మొహమ్మద్‌ హస్నైన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌ నవంబర్‌ 8న అడిలైడ్‌ వేదికగా జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement