ఈ ప్రపంచకప్‌లో రెండు మేటిజట్లయిన ఆస్ట్రేలియా, శ్రీలంక వరుస ఓటములతో గడ్డుస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు జట్లు రేపు(సోమవారం) ముఖాముఖి తలపడుతున్నాయి. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచితీరాలి. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో పాట్‌కమిన్స్ బృందం వైఫల్యాలను ఎదుర్కొంటుండగా, ఛేజింగ్‌లో లంకేయుల బలహీనతలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో కీలక ఆటగాడు దాసన్ శనక గాయంతో వైదొలగడం శ్రీలకంకు ప్రతికూలంగా మారింది. ఈ స్థితిలో టాప్-4లో నిలిచేందుకు ఈ మ్యాచ్ ఫలితం ఇరుజట్లకు కీలకం కాబోతున్నది.
ఆతిథ్య భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నది. బ్యాటింగ్‌లో రాణిస్తూ భారీ స్కోర్లు చేస్తున్నప్పటికీ, విజయానికి అవసరమైన రన్‌రేట్‌ని కొనసాగించడంలో లంకేయులు చతికిలపడుతున్నారు. తొలి రెండు మ్యాచ్‌లలో వారి పరాజయానికిదే కారణం. పాకిస్తాన్‌పై మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ సెంచరీ చేసినా జట్టు విజయానికి దోహదపడలేదు. ఈ పరిస్థితిలో కెప్టెన్ దాసన శనక గాయంతో టోర్నమెంట్‌కు దూరం కావడం కోలుకోలేనిదెబ్బ. అతని స్థానంలో కుశాల్ మెండిస్ సారథ్యం వహించనున్నాడు. బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తే ఆసీస్‌ను కట్టడి చేయడంలో స్పిన్నర్లు తమవంతు పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా ఒకింత అయోమయంలో ఉంది. మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత దక్షిణాౖఫ్రికాతో పోరుకు జట్టులో రెండు మార్పులు చేసింది. ఇప్పుడిక వారిముందున్న ప్రత్యామ్నాయ ఎంపికల్లో ట్రావిస్ హీడ్, సీన్ అబాట్ట్ మాత్రమే మిగిలారు. అలెక్స్ క్యారీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ సామర్థ్యం పెరగాలి. హాఫ్‌సెంచరీలతో నిలకడగా ఆడాలి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో తక్కువ బ్యాటింగ్ సగటు కలిగిన జట్టు ఆసీసే. రెండు మ్యాచ్‌లలోనూ పట్టుమని రెండొందలు దాటలేక పోయింది.
అడమ్ జంపా వర్సెస్ మెండిస్
బౌలింగ్ ప్రయోగాల్లోనూ కంగారూలు తప్పిదాలు చేశారు. ఆస్యిన్ అగర్ స్థానంలో ఆడం జంపానును విస్మరించింది. బదులుగా పార్ట్‌టైమ్ స్పిన్నర్ గ్లెన్‌మ్యాక్స్‌వెల్‌పై ఆధారపడింది. ఇక ఆరోన్ పించ్ తుంటినొప్పితో బాధపడుతుండటం ఆసీస్ బౌలింగ్ పదను తగ్గేలా చేసింది. మరోవైపు ప్రత్యర్థి శిబిరంలో కుశాల్ మెండిస్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అఎn్గాన్‌తో వార్మప్ ఇన్నింగ్స్‌లను కలిపిచూస్తే, అతని చివరి మూడు మ్యాచ్‌లలో 356 పరుగులు చేశాడు. పాక్‌పై మెరుపు సెంచరీ కొట్టాడు. అయితే ఇప్పుడు వికెట్ కీపర్‌తోటు కెప్టెన్సీ బాధ్యతల్ని ఏమేరకు మోయగలడన్నది సందేహం. మెండిస్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో 11 ఇన్నింగ్స్‌లలో 50.33 సగటుతో మంచి రికార్డు కలిగివున్నాడు.
జట్టు అంచనాలు..
ఆస్ట్రేలియా: వార్నర్, మిచెల్‌మార్ష్, స్మిత్, లబుషేన్, జోష్ ఇంగ్లిష్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, స్టార్క్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.
శ్రీలంక: నిస్సాంక, పెరీరా, మెండిస్, సమరవిక్రమ, అసలంక, ధనంజయ డిసిల్వ, దునిత్ వెల్లలగే, కరుణరత్నె, మహేశ్ తీక్షణ, దిల్షాన్ మధుశంక.