ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఈ నెల 15 వరకూ నిషేధం విధించిన ఆస్ట్రేలియా.. ఇక తమ వాళ్లను వెనక్కి తీసుకొచ్చే పనిలో ఉంది. శుక్రవారం ఇండియాకు అవసరమైన అత్యవసరాలను తీసుకెళ్లిన విమానమే తమ వాళ్లను స్వదేశానికి తీసుకురానున్నట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ వెల్లడించారు. అయితే ఇండియాలో విమానం బయలుదేరే ముందే ప్రయాణికులు నెగటివ్ ఆర్టీ-పీసీఆర్, నెగటివ్ యాంటిజెన్ టెస్టుల రిపోర్టులను కచ్చితంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కొన్నాళ్ల పాటు ఇండియా విమానాలపై నిషేధం విధించడం వల్ల దేశంలోని క్వారంటైన్ కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించిందని, ఇక్కడ మూడో వేవ్ రాకుండా అడ్డుకోగలిగామని మోరిసన్ చెప్పారు.
విమానం శనివారం ఆస్ట్రేలియాలో ల్యాండవనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. తొలి విడతగా 150 మంది ఆస్ట్రేలియా పౌరులు స్వదేశానికి వెళ్లనున్నారు. అక్కడ దిగిన తర్వాత రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. సుమారు 9 వేల మంది ఆస్ట్రేలియా పౌరులు ఇండియాలో చిక్కుకుపోయారు. జూన్ చివరికి నాటికి వెయ్యి మందిని తిరిగి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు