బెంగళూరు : ఓ హంతకుడి ఆచూకీ చెప్పిన వారికి రూ.5కోట్ల నజరానా అందజేస్తారట.. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న ప్రభా అరుణ్‌కుమార్ (41) 2015 మార్చి 7న హత్యకు గురయ్యారు. బెంగళూరుకు చెందిన ఆమె గొంతులో కత్తితో పొడిచి దుండగులు కడతేర్చారు. హత్య జరిగి సుమారుగా పదేళ్లవుతున్నా ఇప్పటి వరకు హంతకుడి వివరాలు, ఆచూకీ అక్కడి పోలీసులు గుర్తించలేకపోయారు.
వివరాలు, ఆచూకీ చెప్పిన వారికి మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తామని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం ప్రకటించిన బహుమతి మన దేశ కరెన్సీలో రూ.5.57 కోట్లకు సమానం. బెంగళూరులోని మైండ్ ట్రీ కంపెనీలో పని చేస్తున్న ఆమె విధి నిర్వహణలో భాగంగా సిడ్నీకి వెళ్లారు. విధులు ముగించుకుని బెంగళూరులో ఉన్న భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటికి నడిచి వస్తున్న సమయంలో తనను ఎవరో వెంబడించుకుని వస్తున్నట్లు అనిపిస్తుందని, తర్వాత ఫోన్ చేస్తానని ఆమె చెప్పారు.
అక్కడ తన ఇంటికి 300మీటర్ల దూరంలోనే హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరు వెంబడించుకుని వచ్చారు? ఎందుకు హత్య చేశారు? ఎవరు హత్య చేశారనే విషయాన్ని ఇప్పటి వరకు అక్కడి పోలీసులు గుర్తించలేకపోయారు. ఇపుడామెను కడతేర్చిన వారి కోసం ఆస్ట్రేలియా, భారత్‌లో వేట మొదలైంది.