హైదరాబాద్, ఆంధ్రప్రభ : పంచాయతీరాజ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మంగళం పాడనుంది. ఇకపై ఈ పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 2019లో రాష్ట్ర్ర ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన దాదాపు 3000 మందిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని రెగ్యులరైజ్ చేయనున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పని ఒత్తిడి, రెగ్యులరైజేషన్ కాల పరిమితి పెంచడం, వేతనాలు తక్కువగా ఉన్నాయనే పలు కారణాలతో చాలా మంది రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. కొందరు పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇలా పలు కారణాలతో దాదాపు 2516 జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీ అయ్యాయి. వాటిని అర్హత పరీక్షలోల రెండో స్థానంలో నిలచిన వారితో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేశారు. దీంతో వీరంతా ఇదే పద్దతిలో విధులు నిర్వర్తిస్తున్నారు.
తాజాగా, రాష్ట్ర్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ విభాగాలలో ఖాళీలను భర్తీ చేస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో గ్రూప్ 4 కింద గుర్తించిన ఉద్యోగాల జాబితాలో 2516 పోస్టులను ఖాళీగా చూపించింది. ఇకపై పంచాయతీరాజ్ శాఖలో కార్యదర్శులను ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకోరాదనీ, ఈ పద్దతిలో నియామకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ జిలాల పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కార్యదర్శుల భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న తమ పరిస్థితి ఏమిటని గ్రామ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు.
2019లో తమను డైరెక్ట్‌గా రిక్రూట్ చేసిన సమయంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, ఇప్పుడు తమను రెగ్యులరైజ్ చేయకపోగా పోస్టులను ఖాళీగా చూపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2516 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే తమ పరిస్థితి ఏమిటని తమ కుటుంబాలను రోడ్డున పడవేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వీఆర్వోల మాదిరిగా తమ ఔట్ సోర్సింగ్ పంచాయతీ రాజ్ కార్యదర్శుల వ్యవస్థను రద్దు చేయడం లేదా తమ స్థానంలో కొత్త వారిని నియమించే చర్యలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేస్తున్నారు.