Home క్రీడాప్రభ Aus vs Ind, 2nd Test : ఆడిలైడ్ టెస్ట్ లో ఆసీస్ దే విజయం

Aus vs Ind, 2nd Test : ఆడిలైడ్ టెస్ట్ లో ఆసీస్ దే విజయం

0
Aus vs Ind, 2nd Test : ఆడిలైడ్ టెస్ట్ లో ఆసీస్ దే విజయం

ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైంది. 128/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(5/57) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. స్కాట్ బోలాండ్(3/51), మిచెల్ స్టార్క్(2/60) మిగతా వికెట్లు పడగొట్టారు. భారత బ్యాటర్లలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మూడో రోజు రోజు ఆట ఆరంభంలోనే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను మిచెల్ స్టార్క్‌ ఫస్ట్ ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పంత్(28) ఓవర్ నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు జోడించకుండానే వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అశ్విన్‌(7)ను కమిన్స్ ఔట్ చేయడంతో.. హర్షిత్ రాణా సాయంతో నితీస్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.

కానీ కమిన్స్ హర్షిత్ రాణాను ఔట్ చేసి అతనిపై ఒత్తిడి పెంచాడు. కమిన్స్ బౌన్సర్లను బౌండరీలకు తరలించిన నితీష్.. అప్పర్ కట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన సిరాజ్ ఓ బౌండరీ బాది బోలాండ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఆసీస్ 157 పరుగుల ఆధిక్యాన్ని రెండో ఇన్నింగ్స్‌లో అధిగమించిన భారత్ 18 పరుగుల లీడ్ మాత్రమే అందుకుంది. దాంతో ఆసీస్ ముందు 19 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 180 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసీస్ వికెట్ కోల్పోకుండా విజయలక్ష్యాన్ని చేరుకుంది.

Exit mobile version