దేశాన్ని విద్యుత్ వాహనాల తాయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది. వందకు పైగా కీలకమైన ఖనిజాల వేలం ప్రక్రియను మరో నాలుగు నెలల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు, జీరో ఉద్గారాల లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన ముడి పదార్ధాల సరఫరాలను మరింత మెరుగుపరిచేందుకు, వీటి దిగుమతులపై ఆధారడటాన్ని తగ్గించేందుకు వేలం ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ముగించాలని భావిస్తోంది.
వేలం వేసే కీలకమైన ఖనిజాల్లో ముఖ్యంగా లిథియం, నికెల్, కోబాల్ట్, ప్లాటినం వంటి ఖనిజాలు ఉన్నాయని గనుల శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ తెలిపారు. వేలం ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన ప్రక్రియతో పాటు, బ్లాక్స్‌ను గుర్తించడం పూర్తయ్యిందని చెప్పారు. మైనింగ్‌కు సంబంధించి ఈ డిసెంబర్ నాటికి బిడ్స్‌ను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ఇది పూర్తయిన తరువాత మూడు నెలలకు వేలం ప్రక్రయను ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రస్తుతం మన దేశంలో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాల గనులు లేవు. ఈ నిక్షేపాలను కొంత కాలం క్రితమే జమ్ముఅండ్ కాశ్మీర్, కర్నాటక, రాజస్థాన్‌లో భారీగా కనుగొన్నారు. ఈ ఖనిజాలను త్వరగా వెలికి తీయడం ద్వారా మన దేశంలోనే విద్యుత్ వాహనాలకు, మొబైల్ బ్యాటరీలకు కావాల్సిన లిథియం, నికెల్, కోబాల్ట్ దేశీయంగానే అందుబాటులోకి రానుంది. ఇవి అందుబాటులోకి వస్తే దేశీయంగానే భారీగా విద్యుత్ వాహనాలను తయారీ చేసుకోవచ్చు. వీటి ధరలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.
వేలంలో గ్లోబల్ కంపెనీలతో పాటు, స్థానిక కంపెనీలు కూడా పాల్గొనేందుకు ప్రభుత్వం ప్రోత్సహం ఇవ్వనుంది. ఖనిజాల అన్వేషణకు కంపెనీలకు అయ్యే ఖర్చులో సగం రీఎంబర్స్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని భరద్వాజ్ తెలిపారు. వేలంలో గనుల బ్లాక్‌లు దక్కించుకున్న కంపెనీలు కనీసం మూడు సంవత్సరాల్లోగా వీటిలో మైనింగ్ జరపాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కీలకమైన ఖనిజాల మైనింగ్‌లో ప్రైవేట్ సంస్థలు కూడా పాల్గొనేలా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చట్టాల్లో సవరణలు చేసింది. సాధారణంగా ఇప్పటి వరకు ముఖ్యమైన, కీలకమైన ఖనిజాలను ప్రభుత్వ రంగంలోనే మైనింగ్ జరిపేవారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థలైన కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, మూడు ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే అనేక కీలక ఖనిజాల తవ్వకాల్లో మంచి అనుభవం కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు మన దేశంలో పాటు దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లో ఖనిజాల తవ్వకాలు జరుపుతున్నాయి. తాజాగా వేలం నిర్వహించనున్న 100 ముఖ్యమైన విలువైన ఖనిజాల వేలంలోనూ ఈ సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో పాటు పాల్గొననున్నాయి. జాతీయ ప్రయోజనాల రీత్యా ఇప్పటి వరకు కీలకమైన ఖనిజాల తవ్వకాల్లో ప్రైవేట్ సంస్థలను అనుమతించలేదు. ఇప్పుడు చట్ట సవరణతో ఈ రంగంలోకి తొలిసారిగా ప్రైవేట్ రంగ మైనింగ్ సంస్థలు అడుగుపెట్టనున్నాయి.