ప్రో-కబడ్డీ లీగ్ 10వ సీజన్ కోసం రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 8-9 తేదీల్లో ముంబైలో ఆటగాళ్ల వేలం జరుగనుంది. ఈమేరకు ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) నిర్వాహకులు మషాల్ స్పోర్ట్స్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆటగాళ్ల కొనుగోలు కోసం ప్రతి ఫ్రాంచైజీకి నగదు పరిమితిని రూ.4.4 కోట్ల నుంచి 5 కోట్లకు పెంచారు. కేటగిరీ ఎ, బి, సి, డిగా స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు నాలుగు విభాగాలుగా విభజించబడతారు ప్రతివిభాగంలో ఆల్-రౌండర్లు, డిఫెండర్లు, రైడర్లుగా ఉపవిభజన చేయబడతారు.
కేటగిరీ ఎ- రూ. 30 లక్షలు, కేటగిరీ బికి రూ. 20 లక్షలు, కేటగిరీ సికి రూ13 లక్షలు, కేటగిరీ డి కి రూ. 9 లక్షలుగా బేస్ ధరలు నిర్ధారించారు. ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2023 రెండు ఫైనలిస్ట్ జట్ల నుండి 24 మంది ఆటగాళ్లతో సహా మొత్తం 500 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటారు. లీగ్ విధానాల ప్రకారం పీకేఎల్ జట్లు తమ సంబంధిత పీకేఎల్ సీజన్ 9 జట్టులోని ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కలిగివుంటాయి. ముంబయిలో జరిగే రెండు రోజులపాటు ఈ వేలం ప్రక్రియ జరగనుంది.