Saturday, November 23, 2024

అటెన్షన్‌ ప్లీజ్‌..రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు జవసత్వాలపై సోనియా నజర్‌

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ తదితర అనేక రాష్ట్రాల్లో పార్టీని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ మాత్రం దాని గురించి మాట్లాడకపోవడం విశేషం. అంతర్గత కాంగ్రెస్‌ డైనమిక్స్‌, వివిధ రాష్ట్ర పార్టీ విభాగాలలోని ఫ్యాక్షనిజం, 2024 సార్వత్రిక ఎన్నికలలో గెలుపు పరిమితులు, పార్టీ వ్యవహారాల్లో గాంధీయేతర నాయకుడి ఆవశ్యకత వంటి భారీ మార్పులు కాంగ్రెస్‌లో కీలకంగా మారాయి. ఇప్పుడు సోనియా గాంధీ ఎజెండాలో రాజస్థాన్‌ ప్రధానమైనది. ఇక్కడ సీఎం పదవికోసం సచిన్‌ పైలట్‌ క్యూలో నిల్చున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ‘చింతన్‌ శివిర్‌’ తర్వాత రాజస్థాన్‌ ప్రతిష్టంభనకు తెరపడొచ్చని కాంగ్రెస్‌వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను ఏఐసీసీ సెక్రటేరియట్‌లో ఉన్నత పదవిని చేపట్టాలని కోరతారని ప్రచారం జరుగుతోంది. 70 ఏళ్ల సీనియర్‌ నేత ఇందుకు ఏమాత్రం అంగీకరిస్తారన్నదే ఆసక్తికర అంశం.

గెహ్లాట్‌ వర్సెస్‌ పైలట్‌..

సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేతల ముందు తన ప్రజెంటేషన్‌లో, 2024 లోక్‌సభ ఎన్నికలకు, ముఖ్యంగా రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్‌ గెలుపొందేందుకు అవసరమైన ప్రమాణాలపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక సూచనలు చేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ గెహ్లాట్‌ లేదా సచిన్‌ పైలట్‌ నాయకత్వంలో ఎక్కువ పార్లమెంటరీ స్థానాలను అందించడానికి మెరుగైన సన్నద్ధమైందా అనేది పెద్ద ప్రశ్న. రాజస్థాన్‌ ఇంచార్జ్‌ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌ సవివరమైన నివేదికను సమర్పించినట్లు సమాచారం. నవంబర్‌-డిసెంబర్‌ 2023 రాష్ట్ర అసెంబ్లి ఎన్నికలలో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించేందుకు కలిసి పనిచేస్తానని పైలట్‌ సోనియా గాంధీకి హామీ ఇచ్చారని సమాచారం. 2022 జూన్‌లో రాజస్థాన్‌లో నాలుగు రాజ్యసభ రాబోతున్నాయి. కాంగ్రెస్‌కు మూడు స్థానాలు దక్కే అవకాశం ఉంది. రాజస్థాన్‌ ప్రతిష్టంభనకు ముగింపు పలకడానికి రాజ్యసభ నామినేషన్‌ కీలక పాత్ర పోషించనుంది.

పంజాబ్‌ చేదు అనుభవం..

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు 114 రోజుల ముందు సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని నియమించిన చేదు అనుభవాన్ని కాంగ్రెస్‌ ఇప్పటికీ దిగమింగుకోలేక పోతోంది. సోనియాగాంధీ మనసులో ఇది మెదులుతోంది. రాజస్థాన్‌ విషయంలో అలాంటి పొరపాటు జరగొద్దని అగ్రనేతలు భావిస్తున్నారు. 15 గురుద్వారా రకబ్‌గంజ్‌ రోడ్‌లోని కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో జోరుగా మంతనాలు జరుగుతున్నాయి. ఇది హర్యానాకు సంబంధించినది. ఇక్కడ రాష్ట్ర పార్టీ యూనిట్‌ కొత్త చీఫ్‌ కోసం అన్వేషణ జరుగుతోంది. హర్యానా కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు కుమారి సెల్జా ఇప్పటికే రాజీనామా చేశారు. ప్రస్తుతం హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నేతగా ఉన్న అనుభవజ్ఞుడైన భూపేంద్ర సింగ్‌ హుడా కొత్త బాధ్యతలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో, రాష్ట్ర పార్టీ యూనిట్‌ చీఫ్‌ కమల్‌ నాథ్‌ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయడానికి కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. అనుభవజ్ఞుడైన నాథ్‌, 2023 రాష్ట్ర అసెంబ్లి ఎన్నికల్లో మరోసారి పార్టీని నడిపించేందుకు ఆసక్తిగా ఉన్నాడని, తన జట్టులోని యువ నాయకులను తయారు చేసేందుకు సిద్ధమయ్యాడని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజస్థాన్‌ మాదిరిగానే, జూన్‌ 2022లో జరిగే రాజ్యసభ ఎన్నికలు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అంతర్గత డైనమిక్స్‌లో కీలక పాత్ర పోషించ బోతున్నాయి. రెండు సంవత్సరాల క్రితం, కమల్‌ నాథ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజ్యసభ ఎన్నికలకు ముందు జరిగిన ఉత్కంఠతో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేసి బిజెపికి ఫిరాయించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement