రామగిరి, (ప్రభన్యూస్): సింగరేణి భూ నిర్వాసిత గ్రామమైన లద్నాపూర్ బాధితుల ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు యత్నించడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గత కొన్ని రోజులుగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయమై నిర్వాసితులు, సింగరేణి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఆర్జీ3 జీఎం మనోహర్ నేతృత్వంలో మంథని సీఐ సతీష్, రామగిరి ఎస్‌ఐ రవిప్రసాద్, పోలీస్ బందోబస్తు మధ్య 4 షావెల్స్, ఒక డోజర్, జేసీబీలతో నిర్వాసితుల ఇళ్లను కూల్చివేసే ప్రయత్నం చేశారు.
పనులకు అడ్డు వస్తున్నారన్న కారణంగా సర్పంచ్ బడికెల విజయ శ్రీనివాస్, ఎంపీటీసీ ఉమా రాజయ్య, మాజీ ఎంపీటీసీ వనం రాంచందర్‌రావు, వార్డుసభ్యులు గెల్లు భార్గవ్, నూనె మల్లేశ్‌లను అక్రమంగా అరెస్టు చేసి గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు బాధితులు తెలిపారు. చర్యను నిరసిస్తూ కొందరు భూ నిర్వాసితులు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులను పోలీసులు అరెస్టు చేసి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తరలించారు. కాగా, తమను అదనపు కలెక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతి కల్పించాలని నిర్వాసితులు కోరినట్లు సీఐ సతీష్ తెలిపారు. ఉన్నతాధికారుల అనుమతితో పెద్దపల్లికి తరలించినట్లు వివరించారు.