Saturday, November 23, 2024

Delhi | ఏపీలో దళితులపై దాడులు.. ఎస్సీ కమిషన్‌కు కాంగ్రెస్ నేత హర్షకుమార్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. దళితులపై దాడుల ఘటనల్లో పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌ను కలిసిన హర్షకుమార్, అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితులకు న్యాయం జరగనప్పుడు ఎస్సీ కమిషన్ ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న దాడుల గురించి ఎస్సీ కమిషన్ సభ్యులతో సుమారు గంట సేపు మాట్లాడానని, అక్కడి పరిస్థితులను వివరించానని చెప్పారు. త్వరలో జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ఒక బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తుందని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పర్యావరణ దోపిడీ గురించి కూడా కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్టు హర్షకుమార్ చెప్పారు.

రాష్ట్రంలో యదేచ్ఛగా కొండలు తవ్వేసి మట్టి, రాయి అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఈ దారుణాలు గత పదేళ్లుగా జరుగుతున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొంత మేర జరిగాయని, ఇప్పుడు వైఎస్సార్సీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం కొండలన్నీ పిండి చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయని విమర్శించారు. రియల్ ఎస్టేట్ ఆగడాలు కూడా రాష్ట్రంలో పెరిగిపోయాయని హర్షకుమార్ అన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా అరాచకాలపై కూడా చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కార్యదర్శిని కోరినట్టు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement