అమరావతి, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మ కుటుంబంపై జరిగిన దాడిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆదివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వైకాపా పరిపాలనలో విమర్శిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం వెంకాయమ్మపై దాడి చేశారని, ఇప్పుడు ఆమె కుమారుడిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత మహిళపై దాడులు కొనసాగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక కుటుంబంపై అరాచక శక్తులు పదేపదే దాడులకు పాల్పడుతున్నా.. అడ్డుకోకపోవడం మీ వైఫల్యం కాదా అని పోలీసులను నిలదీశారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ..
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై వైకాపా దాడులు పరిపాటిగా మారాయని, దూషణలు, బెదిరింపులు, హత్యల ద్వారా విమర్శించే వారిని భయాందోళనలకు గురిచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వెంకాయమ్మ కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదివారం డీజీపీకి ఒక లేఖ రాశారు. పోలీస్ అధికారుల సహకారంతోనే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గత నెల 16వ తేదీన వెంకాయమ్మపై దాడి జరిగినా చర్యలు తీసుకోలేదని ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కుమారుడిపై దాడి జరిగిందని పేర్కొన్నారు. తృటిలో వెంకాయమ్మ కుమారుడు వంశీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. వెంటనే వెంకాయమ్మ కుటుంబానికి తగిన రక్షణ కల్పించడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేఖతో పాటు సంఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలను చంద్రబాబు జతచేసి డీజీపీకి పంపారు.
దళిత మహిళపై దాడి హేయం.. అచ్చెన్నాయుడు
పాలనా వైఫల్యాలను, తప్పులను ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడటం వైకాపా నేతలు, కార్యకర్తలకు దినచర్యగా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వెంకాయమ్మ కుటుంబంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టినందుకు వెంకాయమ్మ ఆమె కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తారా అని నిలదీశారు. సోషల్ మీడియాలో వెంకాయమ్మపై దుష్ప్రచారాన్ని సాగిస్తూ వ్యక్తిక్త హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే పోలీసులు వెంకాయమ్మ కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని భవిష్యత్‌లో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.