Tuesday, November 26, 2024

ఉక్రెయిన్‌పై దాడి పాశవిక చర్య.. జెలెన్‌ స్కీ దమ్మున్న నాయకుడు: అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌

ఉక్రెయిన్‌పై-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి ఆదివారం స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రష్యా దాడులు చేస్తుండటం అత్యంత పాశవికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఫ్లోరిడాలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్రంప్‌ తెలిపారు. ఆ దాడులను అత్యంత భయంకరమైన ఘటనగా భావిస్తున్నట్టు వివరించారు. ఇటువంటి దుశ్చర్యలు ఎప్పటికీ జరగకూడదని అన్నారు. రష్యా దాడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ ప్రజలు సంక్షేమం కోసం తాము ప్రార్థనలు చేస్తున్నామని తెలిపారు. యుద్ధ సమయంలో బైడెన్‌ తీరు కూడా సరిగ్గా లేదని చెప్పారు. మొదట్లో ఉక్రెయిన్‌కు బలగాలు పంపాలని నిర్ణయించినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మేధావి అని వ్యాఖ్యానించిన ట్రంప్‌.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఉక్రెయిన్‌ ప్రజలకే నా మద్దతు..

అమెరికా కూడా తమ దక్షిణ సరిహద్దులను కాపాడుకునేందుకు అలాగే శాంతి పరిరక్షణ దళాలను పంపించాలని ట్రంప్‌ సూచించారు. ఉక్రెయిన్‌ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ఆయన ధైర్యంగల నాయకుడు అని కొనియాడారు. రష్యా దాడులు చేస్తున్నా.. కీవ్‌లోనే ఉంటూ ప్రజలకు అండగా నిలిచిన గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. రష్యా నుంచి ఎన్ని హెచ్చరికలు వస్తున్నా.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయని ధీరుడు అన్నాడు. సైనికులను ఉత్తేజ పర్చడానికి స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలిపారు. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. మోసపూరితంగా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ గెలిచారని, తాను అధికారంలో ఉంటే.. ఈ సంక్షోభం వచ్చేది కాదన్నారు. పుతిన్‌ తెలివైన వ్యక్తి అనడంపై స్పష్టత ఇచ్చారు. నాటో, ప్రపంచ నాయకులను ఆయన ఓడించారని, అందుకే తనను తెలివైనవారు అని, నిజానికి మన నాయకులు తెలివి తక్కువ వారు.. అదే అసలైన సమస్య అన్నట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. పుతిన్‌ తెలివైనవారంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను బైడెన్‌ ఖండించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement