Friday, November 8, 2024

ఉదయపూర్‌ హంతకులపై దాడి.. జైపూర్ కోర్టు వ‌ద్ద దాడిచేసిన జ‌నం

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ కన్హయ్య లాల్‌ను హతమార్చిన ఇద్దరు నిందితులపై జైపూర్‌ కోర్టు వద్ద ప్రజలు, న్యాయవాదులు దాడి చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు జైపూర్‌లోని ఎన్‌ఐఏ కోర్టు అనుమతి కోసం తీసుకువచ్చినపుడు శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా ఆ పార్టీ నేత నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చాడన్న కోపంతో కన్హయ్యలాల్‌ను రియాజ్‌ అఖ్తారీ, గౌస్‌ మహమ్మద్‌ అనే నిందితులు గొంతుకోసి హతమార్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా వీడియో తీసి ప్రధానమంత్రి మోడీని హతమారుస్తామని హెచ్చరించారు. ఈ హత్య వెనుక పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని భావించిన హోంశాఖ కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఎన్‌ఐఏకు అప్పగించారు. జులై 12వరకు రిమాండ్‌కు పంపగా అజ్మీర్‌లోని హైసెక్యూరిటీ జైలుకు తరలించారు.

కాగా నిందితులను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని జైపూర్‌ కోర్టు అనుమతి కోరేందుకు నిందితులతో సహా ఎన్‌ఐఏ అధికారులు వచ్చినపుడు అక్కడ పెద్దఎత్తున గుమిగూడిన జనం దాడి చేశారు. దాడి చేసినవారిలో కొందరు న్యాయవాదులు కూడా ఉన్నారు. కోర్టులోనూ ప్రజలు, న్యాయవాదులు నినాదాలు చేశారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అంటూ కేకలు వేశారు. ఈ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న వీరిని తమ కస్టడీకి అనుమతించాలని ఎన్‌ఐఏ జైపూర్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. కాగా పది రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

దాంతో నిందితులను భారీ బందోబస్తు మధ్య తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారిని వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో పెద్దఎత్తున ప్రజలు దూసుకొచ్చారు. నిందితుల చొక్కాలను పట్టి బయటకు లాగేందుకు విఫలయత్నం చేశారు. కర్రలు, సీసాలను విసిరారు. దుస్తులు పట్టి వెనక్కు లాగారు. కొందరు నిందితులను చాచి కొట్టారు. ఆ సమయంలో ఎన్‌ఐఏ, పోలీసులు జోక్యం చేసుకుని నిందితులను వాహనంలోకి ఎక్కించి తరలించారు. కాగా కన్హయ్యలాల్‌ గొంతుకోసి హతమార్చిన నిందితులు తల తెంచివేసేందుకు విఫలయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకవేళ రియాజ్‌, గౌస్‌ లాల్‌ను హతమార్చడంలో విఫలమైతే, ఆ పని పూర్తి చేసేందుకు మొహిసిన్‌, అసిఫ్‌ సిద్ధంగా ఉన్నారని పోలీసులు చెప్పారు. కాగా ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు. శనివారం కోర్టువద్దకు తీసుకువచ్చినవారిలో ఈ ఇద్దరూ కూడా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement