హైదరాబాద్,ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోకి అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి తీవ్రకలకలం రేపుతోందని పేర్కొన్నారు. ఇలాంటి తెలివితక్కువ చర్యలు హైదరాబాద్ నగర సహనశీలతకు మచ్చను తీసుకువస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇది జరిగింది :
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో సీసీ టీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. దుండగులు ఆలయం తలుపులు తన్నుతున్నట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. దుండుగులలో ఒకడు ఆలయం గేటును కాలితో తన్ని విరగొట్టాడు. అనంతరం ఆలయంలోని ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.
ఆలయంలో శబ్దాలకు చుట్టుపక్కల వారు అప్రమత్తమై దుండగులను పట్టుకునేందుకు యత్నించారు. అయితే దుండగులలో ఒకరు మాత్రమే స్థానికులకు పట్టబడ్డాడు. దీంతో ఈ ఘటనలో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారైన మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.