కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై కొందరు ఖలిస్తానీలు ఆలయ భక్తులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ వీడియోలు వైరల్ కాగా.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. అయితే ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని.. ఇలాంటి ఘటనలను అంతర్జాతీయ సమాజం ఉపేక్షించకూడదన్నారు. ఇతర మతాల పట్ల వ్యవహరించే రీతిలోనే.. హిందువులపై దాడుల అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.
“పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ వంటి చోట్ల హిందూ సోదరులు, సోదరీమణులపై వేధింపులు, హింసాత్మక ఘటనలతో పాటుగా వారు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హిందువులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆందుకే వారిపై అశ్రద్ధ ఉంటోంది. అలాగే వారికి మద్దతు కూడా తక్కువ. అందుకే చాలా సులభంగా లక్ష్యంగా మారుతున్నారు. వారిపై జరిగే ప్రతి ద్వేషపూరిత చర్య మానవత్వం, శాంతిని గౌరవించే వారందరికీ దెబ్బ. కెనడాలోని హిందూ దేవాలయంపై, హిందువులపై ఈరోజు జరిగిన దాడి నా హృదయాన్ని తాకింది. ఈ దాడి నాకు ఎంతో వేదన, ఆందోళన కలిగించింది. కెనడా ప్రభుత్వం అక్కడి హిందూ సమాజానికి భద్రత కల్పిస్తుందని.. సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు తక్షణ, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని నా ప్రగాఢ ఆశ
“వివిధ దేశాలలో, హిందువులపై హింసాత్మక చర్యలు, ద్వేషం కొనసాగుతూనే ఉన్నాయి, అయితే ఇంత జరుగుతున్నా దేశాధినేతలు, నాయకులు, అంతర్జాతీయ సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నారు. శాంతి ప్రేమికులుగా పిలుచుకునే ఎన్జీవోలు ఎందుకు వినపడనట్లుగా ఉన్నాయి? ఈ విద్వేషాన్ని ప్రశ్నించే స్వరాలు ఎక్కడ ఉన్నాయి? హిందువులకు సంఘీభావం ఎక్కడిది? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడంలో మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాము?
ఇది కేవలం జాలి, కరుణ కోసం చేసిన విజ్ఞప్తి మాత్రమే కాదు, చర్య కోసం ఇస్తున్న పిలుపు. ప్రపంచం హిందువుల బాధలను గుర్తించాలని.. ఇతరుల పట్ల వ్యవహరించే అదే ఆవశ్యకత, నిబద్ధతతో ఈ దాడులను పరిష్కరించాలని పిలుపునిస్తున్నాం. మానవత్వం ఎప్పటికీ ఇలాంటి కరుణను అంగీకరించదు. ఏ వర్గమైనా, ఎక్కడైనా ఇలాంటి హింసకు గురైతే వారికోసం మనమంతా ఐక్యంగా నిలబడదాం” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.