Tuesday, November 26, 2024

G-20 Summit | అతిథి దేవోభవ మా విధానం.. పర్యాటకం అంటే సందర్శన మాత్రమే కాదు: ప్ర‌ధాని

గోవా నుంచి ఆంధ్రప్రభ ప్రతినిధి: పురాణేతిహాసాల్లో పేర్కొన్న “అతిథి దేవో భవ” అన్న సూక్తే తమ విధానమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో జరుగుతున్న జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ చివరి సమావేశాలు, టూరిజం మినిస్టీరియల్ మీటింగ్‌ను ఉద్దేశించి వీడియో సందేశాన్ని పంపారు. అమెరికా పర్యటనలో ఉన్నందున ఆయన తన ప్రసంగాన్ని ఓ వీడియో సందేశం రూపంలో పంపించగా.. మధ్యాహ్నం జరిగిన జీ-20 టూరిజం మంత్రుల సదస్సులో ఆ వీడియోను ప్రసారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని జీ-20 దేశాల పర్యాటక మంత్రులు, ప్రతినిధులను ఆహ్వానించారు.

ప్రపంచంలో 2 ట్రిలియన్ డాలర్ల విలువైన పర్యాటక రంగంలో మంత్రులుగా ఉన్నవారంతా పర్యాటకులుగా మారి రావడం చాలా అరుదు అని, అలా వచ్చినవారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. భారతదేశంలోని ప్రధాన పర్యాటక ఆకర్షక ప్రాంతమైన గోవాలో సహజ సౌందర్యాన్ని, ఆధ్యాత్మికతను అన్వేషించడానికి చర్చల నుంచి కొంత సమయం కేటాయించాలని సూచించారు. భారత ప్రాచీన గ్రంధాలు చెప్పిన అతిథి దేవో భవను ఆచరణలో అమలు చేయడమే తమ విధానమని, తమ దేశంలో టూరిజం అంటే కేవలం దృశ్యాలు, ప్రదేశాలను చూడడం మాత్రమే కాదని తెలిపారు. సంగీతమైనా, ఆహారమైనా, కళలైనా లేదా సంస్కృతి అయినావాటిలో లీనమయ్యే అనుభవాన్ని భారతదేశం అందిస్తుందని అన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారని జీ-20 ప్రతినిధులను ఉద్దేశించి చెప్పారు.

ఎత్తైన హిమాలయాల నుంచి దట్టమైన అరణ్యాల వరకు, పొడి ఎడారుల నుంచి అందమైన బీచ్‌ల వరకు, సాహస క్రీడల నుంచి ధ్యానం, రీ-ట్రీట్‌ల వరకు భారతదేశంలో పర్యాటకానికి కావాల్సినవన్నీ ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. జీ-20కి అధ్యక్షస్థానంలో భారత్ ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా 100 వేర్వేరు ప్రదేశాలలో దాదాపు 200 సమావేశాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశాల కోసం ఇప్పటికే భారతదేశాన్ని సందర్శించిన మీ స్నేహితులను మీరు అడిగితే, వారి రెండు అనుభవాలు ఒకేలా ఉండవని చెబుతారని మోదీ అన్నారు. సుసంపన్నమైన వారసత్వాన్ని సంరక్షించడం తమ ప్రాధాన్యతగా పెట్టుకున్నామని చెప్పారు.

- Advertisement -

అదే సమయంలో పర్యాటకం కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించడం తమ లక్ష్యమని వివరించారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ప్రాధాన్యతల్లో ఒకటిగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రతి ప్రధాన మతానికి చెందిన యాత్రికులను భారత్ ఆకర్షిస్తుందని వెల్లడించారు.

శాశ్వత నగరంగా భాసిల్లుతున్న వారణాసిలో మౌలిక సదుపాయాలను పెంపొందించిన తర్వాత 70 మిలియన్ల మంది యాత్రికులను ఆ నగరం ఆకర్షిస్తోందని చెప్పారు. మునుపటితో పోల్చుకుంటే కంటే యాత్రికుల సంఖ్య పది రెట్లు పెరిగిందని అన్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వంటి కొత్త పర్యాటక ఆకర్షణలను కూడా తాము రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా దాన్ని నిర్మించిన మొదటి ఏడాదిలోనే సుమారు 2.7 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించిందని వెల్లడించారు. గత తొమ్మిదేళ్లలో దేశంలోని మొత్తం పర్యాటక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ప్రధాని వెల్లడించారు.

రవాణా మౌలిక సదుపాయాల నుంచి హాస్పిటాలిటీ రంగం వరకు, నైపుణ్యాభివృద్ధి సహా వీసా విధానాల్లో కూడా మార్పులు తీసుకొచ్చామని వివరించారు. పర్యాటక రంగాన్ని తమ సంస్కరణలకు కేంద్ర బిందువుగా మార్చినట్టు ప్రధాని జీ-20 ప్రతినిధులతో అన్నారు. హాస్పిటాలిటీ రంగం ద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక పురోగతికి విస్తృతావకాశాలున్నాయని, అనేక ఇతర రంగాలతో పోలిస్తే ఈ రంగం ఎక్కువ మంది మహిళలకు, యువతకు ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను త్వరితగతిన సాధించడానికి పర్యాటక రంగం అత్యంత కీలకమని అన్నారు.

గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, పర్యాటక రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ వంటి ఐదు ఇంటర్-కనెక్ట్ ప్రాధాన్య రంగాలపై జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ పనిచేస్తోందని, ఈ ప్రాధాన్యతలు భారతదేశంతో పాటు గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయని సూత్రీకరించారు. ఆవిష్కరణలను నడపడానికి కృత్రిమ మేధస్సు, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఎక్కువగా ఉపయోగించుకోవాలని జీ-20 ప్రతినిధులకు సూచించారు.

ఉదాహరణకు భారతదేశంలో మాట్లాడే విస్తృత శ్రేణి భాషలను రియల్ టైమ్ అనువాదం చేయడం కోసం తాము కృత్రిమ మేధస్సును ఉపయోగించే పనిలో ఉన్నామని చెప్పారు. ప్రభుత్వాలు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు మరియు విద్యాసంస్థల మధ్య సహకారం పర్యాటక రంగంలో అటువంటి సాంకేతికత అమలును వేగవంతం చేయగలదని తాను నమ్ముతున్నానని అన్నారు. భారత్‌లో టూరిజం కంపెనీలకు రుణాల లభ్యతను పెంచడంతో పాటు వ్యాపార నిబంధనలను సులభతరం చేయడం, నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి జీ-20 దేశాలన్నీ కలసి పనిచేయాలని కోరారు.

ఉగ్రవాదం ప్రజలను, దేశాలను విభజిస్తుందని, కానీ పర్యాటకం అందరినీ కలుపుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిజానికి పర్యాటకం అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి, సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. యూఎన్‌డబ్ల్యూటీవో భాగస్వామ్యంతో జీ-20 టూరిజం డ్యాష్‌బోర్డ్ అభివృద్ధి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ఉత్తమ అభ్యాసాలు, కేస్ స్టడీస్ మరియు స్పూర్తిదాయకమైన కథనాలకు వేదికగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీ-20 చర్చలు, ”గోవా రోడ్‌మ్యాప్” టూరిజం యొక్క పరివర్తన శక్తిని గ్రహించేందుకు తోడ్పడుతుందని అన్నారు. భారతదేశం జీ-20 ప్రెసిడెన్సీ నినాదం ”వసుధైవ కుటుంబం” నుంచి ”ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” అన్న నినాదాన్ని తీసుకుని ప్రపంచ పర్యాటకానికి ఒక నినాదంగా మార్చినట్టు చెప్పారు.

భారతదేశం పండుగల నేల అని, దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా పండుగలు జరుగుతాయని ప్రధాని మోదీ చెప్పారు. గోవాలో, సావో జోవో ఫెస్టివల్ త్వరలో రాబోతోందని గుర్తుచేశారు. అయితే అందరూ తప్పక చూడవలసిన పండుగ మరొకటి ఉందని, అది ప్రజాస్వామ్యానికి మాతృకైన ప్రజాస్వామ్య పండుగ ఎన్నికలు అని అన్నారు. వచ్చే ఏడాది భారతదేశం సాధారణ ఎన్నికలను జరుపుకోబోతుందని, ఒక నెల రోజుల పాటు దాదాపు ఒక బిలియన్ ఓటర్లు ఈ పండుగను జరుపుకుంటారని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య విలువలపై తమ స్థిరమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ ఉంటారని అన్నారు. మిలియన్ కంటే ఎక్కువ పోలింగ్ బూత్‌లతో ఈ పండుగను అన్ని వైవిధ్యాలతో చూసేందుకు పర్యాటకులు దేశంలో ఏ మూలకైనా వెళ్లొచ్చని సూచించారు. గ్లోబల్ ఫెస్టివల్స్‌లో అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు భారతదేశాన్ని సందర్శించాలని అందరినీ ఆహ్వానిస్తున్నట్టు ఆయన జీ-20 ప్రతినిధులతో అన్నారు. చివరగా జీ-20 చర్చలు విజయవంతం కావాలని కోరుకుంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement