అతిపెద్ద సముద్ర వంతెన అటల్ సేతును ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే, ఈ బ్రిడ్జిపై కఠిన నిబంధనలు అమలవుతున్నప్పటికీ, వాహనదారులు సెల్ఫీలతో హల్చల్ చేయడం వివాదాస్పదమైంది. కొందరు బ్రిడ్జి పరిసర ప్రాంతాలను చూసేందుకు వెళుతుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అటల్సేతుపై ఆగి ఫొటోలు క్లిక్‌మనిపించడం చట్టవిరుద్ధమని ముంబై పోలీసులు హెచ్చరించారు.
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌పై ఆగి, ఫొటోలు తీసుకునేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అటల్ సేతు చూడదగిన ప్రదేశమని తాము అంగీకరిస్తామని, అయితే ఈ ప్రతిష్టాత్మక వంతెనపై ఆగి ఫొటోలు తీయడం సరైంది కాదని, ఇదేమీ పిక్నిక్ స్పాట్ కాదని, ఈ వంతెనపై హంగామా చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ముంబై పోలీసులు ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.