Tuesday, November 26, 2024

పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ పెన్షన్ స్కీమ్‌లో చేరితే భార్యాభర్తలు నెలకు రూ.10,000 పెన్షన్ పొందొచ్చు. ఆ పెన్షన్ స్కీమ్ పేరు అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana). కేంద్ర ప్రభుత్వం 2015 లో ఈ స్కీమ్ ప్రారంభించింది. అసంఘటిత రంగంలో ఉన్నవారికి పెన్షన్ ప్రయోజనాలు అందించేందుకు ప్రారంభించిన పథకం ఇది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారెవరైనా చేరొచ్చు. ఈ స్కీమ్ ద్వారా నెలకు కనీసం రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. 18 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి నెలకు కనీసం రూ.1,000 పెన్షన్ పొందాలంటే రూ.42 చొప్పున జమ చేయాలి. ఒకవేళ నెలకు రూ.5,000 పెన్షన్ కావాలంటే రూ.210 జమ చేయాలి. అంటే రోజుకు రూ.7 చొప్పున పొదుపు చేస్తే చాలు. 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతీ నెలా అంతే మొత్తం జమ చేస్తూ ఉండాలి.

ఈ పెన్షన్ స్కీమ్‌లో భార్యాభర్తలు ఇద్దరు చేరొచ్చు. ఇద్దరికీ 60 ఏళ్ల వయస్సు నుంచి నెలకు రూ.5,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.10,000 పెన్షన్ పొందడానికి అర్హులు. భార్యాభర్తలు ఇద్దరూ 40 ఏళ్ల లోపు ఈ స్కీమ్‌లో చేరినట్టైతే వారి వయస్సు 60 ఏళ్లు వచ్చిననాటి నుంచి ఇద్దరికి కలిపి నెలకు రూ.10,000 పెన్షన్ లభిస్తుంది. ప్రతీ ఏటా రూ.1,20,000 వరకు పెన్షన్ పొందొచ్చు. 40 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.1,454 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. అదే 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే నెలకు రూ.210 జమ చేస్తే చాలు. అంటే ఈ స్కీమ్‌లో వయస్సు ఎంత తక్కువగా ఉన్నప్పుడు చేరితే అంత ఎక్కువ లాభం ఉంటుంది. అందుకే మీరు వృద్ధాప్యంలో పెన్షన్ కోరుకుంటే ఇప్పుడే ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరితే ఎక్కువ లాభం పొందొచ్చు.

మీకు ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఆ బ్యాంకులో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యంకులు, కోఆపరేటీవ్ బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసులో కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

ఇది కూడా చదవండి: టీటీడీలో ఎన్నో లొసుగులున్నాయ్: RRR

Advertisement

తాజా వార్తలు

Advertisement